కరెంటు కష్టాలకు అసమర్థ, తెలివితక్కువ కాంగ్రెస్‌ కారణం

 కరెంటు కష్టాలకు అసమర్థ, తెలివితక్కువ కాంగ్రెస్‌ కారణం

అప్పు చేసి కరెంటు కొన్నది రైతుల కోసమేనని స్పష్టంచేశారు. ఆదివారం పలు జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్‌ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ” ఆనాడు నేను గంట సేపు అసెంబ్లీలో ఉపన్యాసం చెప్పిన. పీక్‌ అవర్స్‌ వచ్చినప్పుడు రెండు మూడు నెలల పాటు నెలకు రూ.14 వందల కోట్లు పెట్టి ఎంత షార్టేజ్‌ ఉంటే అంత కొనుక్కొచ్చి ఇచ్చినం. అందుకే ఆనాడు రెప్పపాటు సమయం కూడా కరెంటు పోలేదు. మేము ఉన్నప్పుడు పీక్‌లోడ్‌ 14,900 మెగావాట్ల పైచిలుకు పోయింది. మొన్న పీక్‌లోడ్‌ 15,600 మెగావాట్లకు పోయింది. ఓ ఐదారొందలు పెరిగిందంతే. అది కూడా మీరు కొనడం లేదు. కొంత కొంటున్నా, రైతులకు అవసరమైన మేర పవర్‌ కొనడం లేదు. కాబట్టే కరెంటు రావడం లేదు. మొన్నటి వరకు దర్జాగా ఉన్న మోటార్లు ఇప్పుడెందుకు కాలుతున్నయ్‌? ఒక రోజులో ఐదారుసార్లు కరెంటు వస్తూ పోవడం వల్లనే మోటార్లు కాలుతున్నయ్‌. అక్కడక్కడ మావోళ్లు సభలల్లో మాట్లాడుతున్నా కరెంటు పోతున్నది. జగదీశ్‌రెడ్డి నల్లగొండ సభల్లో మాట్లాడుతుంటే ఐదుసార్లు కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడల్లా కింద కూర్చునోళ్లు ‘జై కాంగ్రెస్‌’ అని హేళన చేస్తున్నరు. అయినా మీకు చీమ కుట్టినట్టు లేదు బాధలేదు.

ఉన్నది ఉన్నట్టు నడిపించలేని అసమర్థత
రాష్ట్రం వచ్చాక సంవత్సరంలోనే అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్‌రంగాన్ని సుమారు రూ.35వేల కోట్లు ఖర్చు పెట్టి, రకరకాల పద్ధతులను అవలంబించి, సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీని సంపద్రించి అద్భుతమైన కరెంటును తెచ్చిపెట్టినం. దేశంలో అన్ని రంగాలకు 24గంటల కరెంటు ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానిది. అనాడు కరెంటు పోతే వార్త. ఇయ్యాల కరెంటు ఉంటే వార్త. ఏడున్నర, ఎనిమిదేళ్లు కమర్షియల్‌, డొమెస్టిక్‌, అగ్రికల్చర్‌, ఐటీ, మరే ఇతర రంగమైనా ప్రజలందరికీ 24/7 కరెంటును అద్భుతంగా సప్లయ్‌ చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ. అగ్రగామి రాష్ట్రం. దానికి ఏం చెదలు పట్టింది. 100 రోజుల్లో ఇంత అస్తవ్యస్తం ఏంది? ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు. కొత్తగా మొద్దులు మోసేది లేదు. కట్టెలు కొట్టేది లేదు. కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వేదిలేదు. ఉన్నది ఉన్నట్టు నడిపించలేని అసమర్థత ఏంది? కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి కదా. దానిని నడిపించే తెలివిలేకపోతే ఎట్లా? దీనిని బట్టి మనకు స్పష్టంగా అర్థమైతున్నది ఏందంటే ఇప్పుడు రాష్ర్టాన్ని పరిపాలిస్తున్న పార్టీ, ప్రభుత్వం అసమర్థత, అవివేకం. తెలివితక్కువ తనం. ఉన్న కరెంటును వాడుకునే తెలివిలేదు. ఉన్న మిషన్‌ భగీరథను వాడుకునే తెలివి లేదు. హైదరాబాద్‌కు అద్భుతంగా నీళ్లు, మళ్లా ఐదేండ్ల వాటర్‌ బిల్లులు వస్తున్నయ్‌.

కరెంటు గోస అలా తీర్చినం
హైదరాబాద్‌కు ఇండస్ట్రీలో, ఐటీ రంగంలో అద్భుతమైన పెట్టుబడులు వస్తున్న తరువాత హైదరాబాద్‌ను పవర్‌ ఐలాండ్‌ సిటీగా మార్చినం. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే పెద్దపెద్ద ఐటీ కంపెనీలు, ఇంటర్నేషన్‌ దిగ్గజాలు న్యూయార్క్‌లో పోతది, లండన్‌లో పొతది పవర్‌. కానీ హైదరాబాద్‌లో పోదు అని చెప్పేటట్టు చేసినం. అధికారంలోకి వచ్చిన కొత్తలో రాష్ట్రం నేషనల్‌గ్రిడ్‌తో అనుసంధానం లేకుండె. వెంటపడి నేషనల్‌గ్రిడ్‌తో అనుసంధానం చేయించినం. దాని ఫలితం ఏమంటే మనకు ఏదయినా సందర్భంలో లోటు ఏర్పడితే దేశంలో ఎక్కడి నుంచైనా పవర్‌ను కొనుక్కునే అవకాశాన్ని కల్పించాం అది నెంబర్‌1. ఇక నెంబర్‌2 7600 మెగావాట్లగా ఉన్న ఇన్‌స్టాల్డ్‌ విద్యుత్‌ కెపాసిటీని దాదాపు 18,000 మెగావాట్లకు తీసుకుపోయాం. దానికి అదనంగా రామగుండంలో 1600, యాదాద్రి థర్మల్‌ స్టేషన్‌లో 4000 మెగావాట్లు, మొత్తంగా 5600 మెగావాట్ల సామర్థ్యం వచ్చేలా సదుపాయాలు కల్పించాం. నేనే పదిసార్లు రామగుండం వెళ్లి, వాళ్ల వెంటపడి దానిని కంప్లీట్‌ చేయించినా. మొన్ననే ఎన్టీపీసీని ప్రధానమంత్రి మోదీ స్వయంగా ప్రారంభించినరు. ఆ సప్లయ్‌ కూడా ఇప్పుడు యాడ్‌ అయింది. యాదాద్రిలో కూడా ఒకటో, రెండో యూనిట్లు వచ్చే అవకాశముండె. ఇది మన సొంతం. దీంట్ల నుంచి ఒక్క యూనిట్‌ను కూడా బయటకు ఇచ్చే అవసరం లేదు. మరి ఎందుకు ఈ రోజు ఇబ్బంది పడతా ఉంది? ఇది పరిపాలకుల అసమర్థత అవునా? కాదా? అనేది మీరే ఆలోచన చేయాలె. ఇది పనిచేయలేనటువంటి, పనిచేయ చేతగానటువంటి అసమర్థ ప్రభుత్వం విధానం అనకోవాలా?. ఏవిధంగా అర్థం చేసుకోవాలి. దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఉండి దరిద్రం ఎందుకు?ఇంత అద్భుతమైన పవర్‌ సిస్టం ఎందుకు ఫెయిల్‌ అవుతున్నది? ఏడేండ్లు అందరికీ అందుబాటులో ఉన్న కరెంటు స్విచాఫ్‌ చేసినట్లుగా ఎందుకు మాయమైంది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి?” అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

రామగుండం థర్మల్‌ స్టేషన్‌ బీఆర్‌ఎస్‌ తెచ్చిందే
రామగుండం 4 వేల మెగావాట్ల థర్మల్‌ స్టేషన్‌ ఆనాడు శాంక్షన్‌ చేయించింది మేము. దాంట్లో కేంద్రం 1600 మోగావాట్లు ఇమ్మీడియేట్‌గా చేసిస్తామని కావాల్సిన సదుపాయాలు ఇవ్వమన్నారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎల్లంపల్లి నుంచి వాటర్‌ అలకేట్‌ చేసినం. భూమి కేటాయించినం. పర్మిషన్‌ ఇచ్చినం. పనులు మొదలుపెట్టారు. అయినా ఆలస్యమైంది. 1600 మోగావాట్లు యాడ్‌ అయ్యింది. మేమున్నప్పుడే ఇచ్చిండ్రు. మేం పీపీఏ చేస్తేనే కదా పనులు, వర్క్స్‌ స్టార్ట్‌ చేసింది. మేం ఆరోజే పీపీఏ చేసినం. ఇట్‌ సెల్ఫ్‌ ఈజ్‌ ఏ అగ్రిమెంట్‌. కొత్తగా చేయ్యాల్సింది ఏం ఉండదు. కమిషన్‌ ఆపరేషన్‌ డేట్‌ (సీవోడీ) అనేది రోటీన్‌ ప్రాసెస్‌. ఫార్మల్‌ లెటర్‌. మొన్ననే ప్రధానమంత్రి వచ్చి కమిషన్‌ చేసిండు. గవర్న్‌మెంట్‌ అనేది కంటిన్యూయస్‌ ప్రాసెస్‌.

కరెంటు కష్టాలకు అసమర్థ, తెలివితక్కువ కాంగ్రెస్‌ కారణం
యూ ఆస్క్‌ యువర్‌ ఓన్‌ హార్ట్‌. ఏడేండ్లు బ్రహ్మాండంగా నడిచిన కరెంట్‌ సిస్టం మూడు నెలల్లోనే నడవకుండా పోయిందంటే ఇది ఎవరి అసమర్ధత. ఇది నూటికి నూరు శాతం అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్‌ పార్టీ అసమర్ధత మాత్రమే. మేము ఆనాడు పవర్‌ సిస్టంలో మొత్తం ఐఏఎస్‌ ఆఫీసర్లను తొలగించి టెక్నోక్రాట్స్‌ను పెట్టి నడిపాం. మాకు తెలివిలేక కాదు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్ట్రిబ్యూషన్‌ సిస్టంలో నూటికి నూరు శాతం టెక్నోక్రాట్స్‌నే నియమించాం. ఎలా నడపాలో వారికి తెలుసు కాబట్టి అప్పుడు సమర్థవంతంగా నడిచింది. ఇప్పుడు అందరు ఐఏఎస్‌ ఆఫీసర్లను తెచ్చిపెట్టారు. వాళ్లకు పట్టదు. మంత్రులకు పట్టదు. వాళ్లకు రాజకీయాల కోసం తీరికలు ఉన్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు. రైతుబంధు వేయడానికి తీరిక లేదు. మేము రైతుబంధు వేస్తే వారం పది రోజుల్లోనే పూర్తిగా వేసేవాళ్లం. గరిష్ఠంగా 12 రోజుల్లో అందరు రైతులకు డబ్బు పడిపోయేది. ఇప్పుడు ఐదు ఎకరాలని, మూడెకరాలని, ఏడెకరాలని అనుమానాలు కలిగించి ఏదో విజయం సాధించినట్టు, తోకమట్ట, పెద్ద కథ చేసినట్టు, అదేదో గొప్ప డంబాచారమన్నట్టు, ఇష్టారీతిగ మాట్లాడుతున్నరు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *