కాంగ్రెస్ ది గల్లీలో ఒక నీతి? ..ఢిల్లీలో ఒక నీతా?.
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “అదానీ గారి బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడింది.
ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయి. అదానీ పై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటిికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడింది. అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్లు తీర్పు చెప్పింది. గతంలో హిండెన్ బర్గ్ అనే సంస్థ కూడా అవకతవకలు జరిగినట్లు చెప్పింది. అదానీ అంశం కారణంగా భారత దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారింది.
అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి చాలా మంది మధ్య తరగతి మదుపర్లు నష్టపోయారు. అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించిన మేము ఆయనను రానివ్వలేదు.అదానీ మమ్మల్ని కలిసి వ్యాపారం చేస్తామని అడిగాడు. కానీ మేము ఆయనకు మర్యాద పూర్వకంగా ఛాయి తాగించి పంపించేశాం. అదానీతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే ఎర్ర తివాచీలు కాంగ్రెస్ పరిచింది. కాంగ్రెస్ కు మాకు ఉన్న తేడా అదే. అదానీ విషయంలో బడే భాయ్ ఆదేశించగానే…చోటే భాయ్ అదానీకి రెడ్ కార్పేట్ వేసి స్వాగతం పలికాడు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అదానీ సంస్థలతో రూ. 12, 400 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఘనంగా చెప్పుకున్నారు.
5000 కోట్లు గ్రీన్ ఎనర్జీ, 5000 కోట్లు డేటా సెంటర్, సిమెంట్ పరిశ్రమ పెట్టుబడులు ఇలా మొత్తం 12, 400 కోట్ల పెట్టుబడులు చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ డిస్కంల ను అదానీకి అప్పగించేందుకు ఓల్డ్ సిటీ బిల్లుల వసూళ్ల డ్రామా మొదలుపెట్టారు.అదానీకి డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేశారు. యాదాద్రిలోని రామన్న పేటలో సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఏ మూసీ శుద్ధి అంటున్నారో అదే మూసీ సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా మురికి మాయం అవుతుందని చెప్పిన పట్టించుకోలేదు. ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లుగా మమ అనిపించి అదానీకి సహకరించే పని చేశారు.పైన బడే భాయ్ ఆదేశించటంతో….కింద చోటా భాయ్ ఆచరించాడు.
దీంతో అదానీ గుండె ఉప్పొంగిపోయి స్కిల్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళం ఇచ్చాడు. ఇవన్నీ వ్యవహారాలు కూడా కుట్ర అని మేము భావిస్తున్నాం.
12, 400 కోట్లతో తెలంగాణలో అదానీ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో 4 గంటల పాటు అదానీ సమావేశమయ్యారు.అదానీ వ్యాపార విస్తరణ తెలంగాణలో ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ హైకమాండ్ కు తెలియదా?.చిన్న కార్పొరేషన్ పదవికి కూడా కాంగ్రెస్ లో హైకమాండ్ పర్మిషన్ కావాాలె. మంత్రి వర్గ విస్తరణకు కూడా ఇప్పటి వరకు హైకమాండ్ పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటిది అదానీ తో ఒప్పందాలకు కాంగ్రెస్ హైకమాండ్ పర్మిషన్ లేదని భావించాలా?.రోజు అదానీని విమర్శించే రాహుల్ గాంధీ ఈ ఒప్పందాలకు మద్దతిస్తున్నాడా? చెప్పాలి. పారిశ్రామిక వేత్తలు ఎవరూ ఊరికే విరాళాలు ఇవ్వరని మహారాష్ట్ర ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీ గారే చెప్పారు. నీకిది నాకది అని ఏదో పెద్దదే ఆశించి ఇస్తారని అన్నారు. మరీ ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 100 కోట్లు అదానీ నుంచి విరాళం తీసుకుంది. రాహుల్ గాంధీకి తెలిసి తీసుకున్నారా? లేకుంటే తెలియకుండా విరాళం తీసుకున్నారా?.
కాంగ్రెస్ జాతీయ పార్టీ. దానికి దేశ వ్యాప్తంగా ఓకే విధానం ఉండాలి కదా? .కానీ ఢిల్లీలో అదానీ మంచివాడు కాదు…గల్లీలో మాత్రం అదానీ మంచోడు. కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? .
బీజేపీది డబుల్ ఇంజన్ అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. మరీ వాళ్లది డబుల్ స్టాండర్డ్సా? .అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ వాళ్లు గుడ్ అదానీ, బ్యాడ్ అదానీ అనే విధానం పాటిస్తున్నారు. వాళ్ల పార్టీకి చందాలు ఇచ్చి, ఆర్థికంగా సాయం చేస్తే గుడ్ అదానీ అంటారు.అది వేరే పార్టీలతో కలిసి ఉండి వ్యాపారాలు చేస్తే బ్యాడ్ అదానీ అంటారు. తెలంగాణలో అదానీతో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా? .తెలంగాణ కన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్న కెన్యా ప్రభుత్వం ఆత్మగౌరవంతో వ్యవహారించింది. అదానీ మీద అమెరికాలో కోర్టు తీర్పు ఇవ్వగానే అదానీ తో మొత్తం వ్యాపార సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా అధ్యక్షుడు ప్రకటించారు. కెన్యా రవాణా శాఖ, ఇంధన శాఖ, విద్యుత్, ఎయిర్ పోర్ట్ నిర్వహణ ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. రాహుల్ గాంధీ గారు మాత్రం అదానీ దుర్మార్గుడు అంటుంటారు. మరీ కెన్యా ప్రభుత్వం ఒప్పందాలు రద్దు చేసుకుంటే…మీరు ఎందుకు అదానీతో కుదిరిన ఒప్పందాలను రద్దు చేయటం లేదు.
అదానీ నుంచి ఎంత ఆశించిన మీరు రూ. 12, 400 కోట్ల వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు.
రాహుల్ గాంధీ గారు వెంటనే మీ ముఖ్యమంత్రి కి ఫోన్ చేసి అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని ఆదేశించాలి. ప్రధానితో అదానీ దోస్తీని విమర్శించే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అదానీతో దోస్తీ చేస్తే ఎందుకు ఊరుకుంటున్నారు. అదానీతో దేశానికి నష్టమని రాహుల్ గాంధీ ఉవాచ. మరి దేశానికి నష్టమైతే తెలంగాణకు ఏ విధంగా మేలో చెప్పాలి. కాంగ్రెస్ హైకమాండ్ ను కాదని తెలంగాణలో అదానీకి రెడ్ కార్పేట్ వేశారా?.అలాగైతే కాంగ్రెస్ పరంగా అది చాలా నష్టం చేసే పనే. వెంటనే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా అదానీతో ఒప్పందాలను పునసమీక్షించాలని కోరారు. స్కిల్ యూనివర్సిటీకి విరాళం సరియైనదేనని రాహుల్ గాంధీ గారు భావిస్తున్నారా? .అదానీతో ప్రధాని వ్యాపారం చేస్తున్నాడని ఆయన అవినీతి పరుడని చెబుతున్న రాహుల్ గాంధీ గారు అదే అదానీతో రేవంత్ రెడ్డి వ్యాపారం చేస్తే ఆయన నీతిపరుడు ఎలా అవుతాడు. ఇదంతా రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతుందని భావిస్తున్నాం.
లేదంటే రేవంత్ రెడ్డి గారిపై వెంటనే చర్యలు తీసుకోని…ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకది… మాకిది అని అదానీతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలి. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన వంద కోట్లు కూడా తిరిగి ఇచ్చేయాలి. అదానీ అవినీతి పరుడని రాహుల్ గాంధీ అంటుంటే అలాంటి వ్యక్తి తో మీరు వ్యాపారం ఎలా చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. ఇది తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టటం కాదా రేవంత్ రెడ్డి చెప్పాలి.మహారాష్ట్రలో ఎన్సీపీ చీలకలో అదానీ హస్తం ఉందని అంటారు. ఆయన రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని వింటున్నాం.
కోహినూర్ హోటల్ లో అదానీతో మంత్రి పొంగులేటి సమావేశం గురించి కూడా వివరణ ఇవ్వాలి. బీజేపీ వాషింగ్ మెషీన్ లో పునీతులయ్యేందుకు అదానీతో సమావేశమయ్యారా? .అదానీతో అన్ని ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన వంద కోట్లు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు వెళ్లి అదానీని గజదొంగ అంటాడు. హైదరాబాద్ కు రాగానే గజమాల వేసి స్వాగతం పలుకుతాడు.ప్రధాని, అదానీ అని రేవంత్ రెడ్డి అంటుంటాడు.
మరి ఇది రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్సా. కేసీఆర్ గారు పదేళ్లు సృష్టించిన తెలంగాణ సంపదను క్రోనీ క్యాపిటలిస్ట్ లు దోచుకునేలా చేస్తారా? .అదానీపై కేసులు పెట్టాలా వద్దా? అరెస్ట్ చేయాలా వద్దా? రేవంత్ రెడ్డి చెప్పాలి.ఏ కారణం చేత అదానీతో దోస్తీ కట్టారో కూడా ప్రజలకు చెప్పాలి.దేశం ప్రతిష్ట మంటగలిసిపోతే బీజేపీ ఎందుకు స్పందించటం లేదు.బీఆర్ఎస్ పరంగా మేము అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ మీ విధానం ఏంటో చెప్పండి. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీ విధానం ఏంటీ? .అదానీ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్నది బీజేపీకి సమ్మతమేనా? .అదానీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీల విధానం ఒకటే అన్నట్లుగా కనిపిస్తోంది. రామన్న పేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణను అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు అందరూ వ్యతిరేకించారు.
కానీ కాంగ్రెస్, బీజేపీ మాత్రనే నోరు విప్పలేదు. అందుకే తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేసేది బీఆర్ఎస్ మాత్రమే.అదానీ వ్యవహారంతో వీరి బంధం ఏ విధంగా గాఢంగా ఉందో తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి.
అదానీ వ్యవహారంపై ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని నేను మీడియాను విజ్ఞప్తి చేస్తున్నా. కెన్యా ప్రభుత్వం అన్ని ఒప్పందాలు రద్దు చేసుకున్నప్పుడు…తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఒప్పందాలు రద్దు చేసుకోవాలని రాహుల్ గాంధీ ఎందుకు అడగటం లేదు. బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదానీతో కాళ్ల బేరం చేసుకున్నాడో లేదా చెప్పాలి. అది నిజం కాకపోతే నా ఆరోపణలు తప్పని రుజువు చేయాలి.పొంగులేటి ఇంటి పై ఈడీ రెయిడ్స్ జరిగి ఆరు వారాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఈడీ నుంచి ఒక్క మాట రాలేదు. ఎమ్మెల్యే ఫిరాయింపు విషయంలో రీజనేబుల్ పిరయడ్ లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ముఖ్యమంత్రి ఏడ పోయిన సరే సొల్లు పురాణం మాట్లాడుతూ మొరుగుతున్నాడు. ఆయన ఎంత మొరిగినా సరే మేము మాత్రం సబ్జెక్టే మాట్లాడతాం.మా ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు పోయి రైతులకు సమాధానం చెప్పాలి.