మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు
మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు ఇచ్చేందుకే లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఆరాటపడుతున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.మూసీ పరీవాహక ప్రాంతాలైన హైదర్‌గూడలోని లక్ష్మీనగర్, బహదూర్‌పురాలోని కిషన్‌బాగ్ ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్ ఆలీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ నిన్న సోమవారం పర్యటించారు.
కోట్ల విలువజేసే ఆస్తులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పరిహారంగా ఇవ్వాలనుకోవడం కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గమైన చర్యలకు నిదర్శనమని ఆయన నిప్పులు చెరిగారు.రెక్కల కష్టంచేసి కట్టుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు వస్తున్న రేవంత్‌రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.మూసీ వెంట మార్కింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి బాధితుల గోడు విన్నారు.
పేదల ఇండ్లను మూసీలో కలిపే సుందరీకరణ ఎందుకు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదల గూడులను కూల్చేసే మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. బఫర్‌జోన్ పేరిట మూసీ వెంట మార్కింగ్ చేస్తున్న రేవంత్‌రెడ్డి, దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఆయన సోదరుడి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు.