40 శాతం మందికి రుణమాఫీ జరిగితే 60% మందికి జరగలేదు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి, రాముని పట్ల, ఇబ్రహీం నగర్ గ్రామంలో వడగండ్ల వానతో పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం జరిగింది. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపించింది. ప్రభుత్వం నిజంగా పంటల బీమా చేసి ఉంటే రైతులకు మేలు జరిగేది. పంటల బీమా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.చిన్నకోడూరు మండల్ ఇబ్రహీం నగర్ గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామంలో ఏ రైతును అడిగినా రుణమాఫీ కాలేదనే చెప్తున్నారు.40 శాతం మందికి రుణమాఫీ జరిగితే 60% మందికి జరగలేదు.
రైతుబంధు విషయంలో కూడా సగం మంది రైతులకు అందలేదు.రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ. నేను మొన్న అసెంబ్లీలో అడిగాను భట్టి విక్రమార్క గారు సిద్దిపేటలో ఏ ఊరికి వెళ్దామో రండి లేదా మధిర నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటారో చెప్పండి వస్తానని. అందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని అన్నాను. నరసయ్య అనే రైతు రైతుబంధు పడలేదు, రుణమాఫీ కాలేదు పైగా వడగండ్ల వానకు పంట నష్టపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత వారం 3,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తంగా 12 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. కోడూరు మండలంలో రుణమాఫీ జరిగిన రైతులు 5,300 మంది ఉంటే ఇంకా 7,352 మందికి రుణమాఫీ జరగలేదు.గన్మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా ఏ ఊరికి వెళ్దాము రండి రుణమాఫీ ఎక్కడ జరిగిందో చూద్దాం. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నాను ఏ ఊర్లో పూర్తి రుణమాఫీ జరిగిందో చెప్పండి. వడగండ్ల వానకు నష్టపోయిన పంటల్లో రకరకాల పంటలు ఉన్నాయి. వరితోపాటు మిర్చి, టమాటా, కూరగాయల పంటలు చాలా ఉన్నాయి. రైతులందరినీ ఆదుకోవాలని, వచ్చే వాన కాలంలో విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, 25 వేల ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య గారి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీపక్షాన తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను. వారు వారి భార్య అడవుల పెంపకం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావులు. ప్రతిక్షణం ఒక్కొక్క చెట్టును కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
వారి మరణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.చెట్లు నరకడం రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెట్టడం రామయ్య గారి వంతు. చెట్ల నరికే రేవంత్ రెడ్డి చెట్లు పెట్టే రామయ్యకు సంతాపం చెప్పడం అంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుంది. హార్టికల్చర్ యూనివర్సిటీలో చాలా ఎకరాల్లో చెట్లని నరికేశాడు. HCU లో 400 ఎకరాల్లో చెట్లను నరికాడు. ఈరోజు అధికారులు వాళ్ళ ఉద్యోగాలు పోయి జైల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి తప్పుడు పనుల వల్ల అధికారులు బలయ్యే పరిస్థితి ఏర్పడింది. చెట్ల పెంపకం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం వారి జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన మహనీయులు వనజీవి రామయ్య గారికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు..
