FTL, బఫర్ జోన్ కి మధ్య ఉన్న తేడా ఏంటి..? . అసలు ” హైడ్రా ” అంటే ఏంటీ..?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ “హైడ్రా”. రాజధాని మహానగరంలో ప్రముఖ రాజకీయ నాయకుల దగ్గర నుండి సినీ,సామాన్యుల వరకు వీళ్లందరికీ సంబంధించిన భవనాలు,కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుంది. హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే చాలు నగర వ్యాప్తంగా చిన్న గల్లీ సైతం కాలువలా మారి వరదమయం కావడమే కాకుండా ఇండ్లలోకి సైతం ఆ వర్షపు నీళ్లు వస్తాయి. అయితే రాజధాని మహానగరంలోని ప్రభుత్వ భూములను,చెరువులను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం “హైడ్రా” అనే స్వయం ప్రతిపత్తి ఉన్న ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ నగరంలోని చెరువులను,ప్రభుత్వ భూములను కాపాడటమే లక్ష్యంగా పని చేస్తుంది.
గత వారం రోజులుగా నగరంలో దాదాపు 45ఎకరాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలని కూల్చివేసింది. మరికొన్నింటిని సిద్ధం చేసింది. దీనికి కారణం ఈ కట్టడాలన్నీ FTL ,బఫర్ జోన్ లో ఉండటమే. అసలు FTL,బఫర్ జోన్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా హైడ్రా అనే వ్యవస్థ నగరంలోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడటం.. విపత్తు సమయంలో ప్రజలను కాపాడటమే లక్ష్యంగా జీవో 99ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విడుదల చేశారు. ఈ వ్యవస్థ జాతీయ విపత్తుల చట్టం లోబడి పని చేస్తుంది. ఈ సంస్థ విపత్తుల సమయంలో చర్యలను చేపట్టడమే కాకుండా నగరంలో ఉండే నిర్మాణాలను,ప్రభుత్వ స్థలాలను ఇది పరిశీలిస్తుంది.
బఫర్, FTL పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను ముందుగా నోటీసులు జారీ చేసి అ తర్వాత వాటిని కూల్చి వేస్తుంది. మూడు దశల్లో నగరంలో ఉన్న చెరువులకు పునర్జీవం తీసుకురావడమే లక్ష్యం అని హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అందులో భాగంగా మొదటి దశలో FTL,బఫర్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాలను,నిర్మాణాలను అరికట్టడం.. రెండో దశలో అల్రెడీ బఫర్,FTL జోన్ల పరిధిలో నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం.. మూడో దశలో గొలుసు కట్టు ద్వారా నగరంలో ఉన్న చెరువులన్నీంటిలోనూ నీళ్ళు ఉండేలా చూడటం.. నాలాలను పరిరక్షించడం..
చెరువుల్లో పూడికలను తీయడం అని ఆయన పేర్కొన్నారు.FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవల్ అంటే చెరువుల్లో కానీ నాలాల పరిధిలో ఎంతవరకు నీళ్ల సామర్ధ్యం ఉంటదో ఆ పరిధి వరకు FTL జోన్ అంటారు. బఫర్ జోన్ అంటే రెండు లేదా మూడు నీళ్ల పరిధిలను విడదీసే ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. బఫర్ జోన్ పరిధిలో కానీ FTL పరిధిలో కానీ కట్టడాలు చేయకూడదు.. వీటి పరిధిలో ఉన్న స్థలాలకు పట్టాలు ఉన్న కానీ నీళ్లు లేని సమయంలోనే సాగుకు వాడుకోవాలి తప్పా వాటిలో భవనాలు,కట్టడాలాంటివి నిర్మించకూడదు. ఒకవేళ నిర్మిస్తే వాటిని హైడ్రా కూల్చివేస్తుంది.