మీ తల్లి మీదే.!. మా తల్లి మాదే.! అని కాంగ్రెస్ చెబుతుందా..?
సమైక్య రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒకటే తల్లి ‘తెలుగు తల్లి’ ఉండేది. భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో తెలుగువారందరూ ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని చాలా అభిమానంగా, గర్వంగా పాడుకునేవాళ్ళం. ఆంధ్రా, తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్ ‘మీ తల్లి మీదే.. మా తల్లి మాదే,’ అంటూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కనుక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం సమంజసమే. కానీ ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి ‘మీ (బిఆర్ఎస్) తల్లి మీదే, మా తల్లి (కాంగ్రెస్) మాదే,’ అంటూ మరో తెలంగాణ తల్లి విగ్రహం సిద్దం చేయిస్తున్నారు.
కేసీఆర్ తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఆయన కూతురు కల్వకుంట్ల కవిత పోలికలు కనిపిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించేవారు. తెలంగాణ తల్లి అంటే గడి (కోట)లో ఉండే రాణీగారు కారని, రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ప్రతీకగా ఉండాలంటూ తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోలికలతో మరో తెలంగాణ తల్లి విగ్రహం సిద్దం చేయిస్తున్నట్లు సమాచారం. దీనిపై సహజంగానే బిఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెపుతోంది. “తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రజల అస్తిత్వానికి, గౌరవానికి ప్రతీక.. భరత మాత గానీ, తెలుగు తల్లి గానీ పార్టీల అధికారం మారినా వారి రూపాలు మారలేదు.. కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని ప్రయత్నించడం నీ మూర్ఖత్వానికి నిదర్శనం సైకో రేవంత్,” అంటూ ట్వీట్ చేస్తూ తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, భరతమాత బొమ్మలు కలిపి పెట్టింది.
పార్టీలు మారినా తల్లి రూపాలు మారలేదని చెపుతున్న బిఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర విభజన జరిగి అధికారంలోకి రాగానే తెలుగు మాట్లాడే వారందరికీ ప్రతీకగా నిలిచిన ‘తెలుగు తల్లి’ని పక్కన పెట్టి ‘తెలంగాణ తల్లి’ని ఏర్పాటు చేసుకున్నామన్న విషయం మరిచిన్నట్లుంది. తెలుగు తల్లిని కేసీఆర్ ఆంధ్ర తల్లిగా చూశారు తప్ప తెలుగు భాష మాట్లాడేవారందరికీ ప్రతీకగా చూడకపోవడమే ఇందుకు కారణం. ఏపీలో రాయలసీమ, ఉభయ గోదావరి, కృష్ణ, ఉత్తరాంధ్ర ఇలా ఒక్కో ప్రాంతంలో ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలు, తెలుగు భాష యాస, పదాలు ఒక్కోలా ఉంటాయి. కనుక ఎవరికి వారు వేర్వేరుగా తల్లులు ఏర్పాటు చేసుకోలేదు కదా? అందరూ మాట్లాడేది తెలుగే. కనుక ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ.. మా తెలుగుతల్లికి మంగళారతులు’ అని నోరారా ఆలపించుకుంటున్నారు.
కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని ఇప్పుడు రేవంత్ రెడ్డి అంగీకరించడం లేదు. ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహం మార్చితే తెలంగాణ ప్రజలు ఎవరిని తమ తల్లిగా భావిస్తారో, ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వందలాది తెలంగాణ తల్లి విగ్రహాల పరిస్థితి ఏమిటో? కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలే చెప్పాలి.