పదేళ్ళ పాలనలో బిఆర్ఎస్ ప్రజలకు చేసింది శూన్యం
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విజయవంతంగా సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి అహరహం శ్రమిస్తుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంత చేస్తూ ప్రజల ముందు మరింత చులకనవుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ కెటిఆర్ ను ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శిండమే ధ్యేయంగా అర్థంలేని ఆరోపణలు చేస్తూ ఏదో సాధించామని అనుకుంటున్నారని పేర్కొన్నారు. పది సంవత్సరాల పాలనలో బిఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకే ప్రజలు మిమ్మల్ని ఓడించి, కాంగ్రెస్ పార్టీని గెలిపించారనే విషయాన్ని గమనించాలని కెటిఆర్ కు మంత్రి సురేఖ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సామాన్య కార్తకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగుతున్నదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. పొరుగ రాష్ట్రాల వాళ్ళు చూస్తే అసహ్యించుకునేలా కెటిఆర్ మాటతీరు వుంటున్నదని మంత్రి సురేఖ అన్నారు. పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకుని, అప్పుల ఊబిలోకి నెట్టి పథకాల అమలను తప్పించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చెప్తున్నాడని ప్రచారం చేస్తున్నారని మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత రికార్డులను పరిశీలిస్తే పదేళ్ళ వారి దోపిడీ బయటపడుతుందనే ఎంక్వైరీలకు సహకరించడంలేదని మంత్రి సురేఖ తెలిపారు. రెండోసారి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం మొదలు ఫోన్ ట్యాపింగ్ ల వరకు మీ పాలనంతా అవినీతి, అక్రమాలే అని ప్రజలు తెలుసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టి సంక్షేమ రాజ్యాన్ని తెచ్చుకున్నారని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు సాగకూడదన్న ఉద్దేశంతోనే దానికి బాధ్యులైన అధికారులను బిఆర్ఎస్ విదేశాలకు పంపించిందని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి వంటి కేసుల్లో చట్టబద్దంగా ముందుకుపోతున్నామని, నేరం నిరూపితమైన మరుక్షణమే చర్యలు చేపడతామని మంత్రి తేల్చి చెప్పారు.
రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడిపోతుందనడం ప్రజాస్వామ్యం పట్ల కెటిఆర్ కున్న అవగాహనలేమిని, తెరవెనుక నడిపిస్తున్న కుట్రలను తేటతెల్లం చేస్తున్నదని మంత్రి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను రెచ్చగొట్టి, వారి భావోద్వేగాలను రగిల్చి కల్వకుంట్ల కుటుంబం పబ్బం గడుపుకున్నదనీ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత వారికి ఉద్యోగాలివ్వకపోవడంతో ఎంతో మంది యువత భవిష్యత్ అంధకారమయమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలోనే వేలాదిగా ఉద్యోగాలిచ్చి యువతకు ఓ దారి చూపిందని మంత్రి సురేఖ తెలిపారు. ఇప్పటికీ బిఆర్ఎస్ పార్టీ ఉద్యోగాల పేరుతో యువతను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నదని మంత్రి సురేఖ మండిపడ్డారు.
నాడు బిఆర్ఎస్ పాలనతో ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి జీతం రాక అనేక ఇబ్బందులు పడ్డారని మంత్రి సురేఖ అన్నారు. కాంగ్రెస్ పాలనతో వారి ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నామని తెలిపారు. ప్రతి దానికి ఉద్యమం చేస్తమని చెప్తూ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో మీరు పెట్రోల్ క్యాన్ లు తెచ్చి అగ్గిపెట్ట మరిచిపోయేవారు, ఈసారి ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడితే అగ్గిపెట్టెన ప్రజలే ఇస్తరని మంత్రి సురేఖ చురకలు అంటించారు. ప్రజలు ఇంకా మీ మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు బిఆర్ఎస్, బిజెపి కుట్రల నుంచి జాగ్రత్తగా వుండాలని మంత్రి సురేఖ ప్రజలకు సూచించారు. కెటిఆర్ తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం మానేస్తే బాగుంటుందని సలహానిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ స్పందించాలిగానీ, అన్నీ తానే అన్నట్లు వ్యవహరించడం కెటిఆర్ నియంత లక్షాణాన్ని స్పష్టం చేస్తున్నదని స్పష్టం చేశారు.
ఎర్రచందనం వ్యాపారం చేసే బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని మంత్రి సురేఖ అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవిని వదులుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు. అటువంటి వ్యక్తిని రారా పోరా, మడిచిపెట్టుకో అంటూ పరుషంగా సంబోధించడం కుసంస్కారమని అన్నారు. గంధపు చెక్కల వ్యాపారం చేసే నీ మీదున్న కేసుల పై దృష్టి పెడితే నువ్వెక్కడి పోతావో ఓసారి ఆలోచించుకో అని హెచ్చరించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఒకతను ఏది పడితే అది మాట్లాడుతూ, అసెంబ్లీలో కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి పై అవాకులు చెవాకులు మాట్లాడుతూ పిచ్చోడిలా వ్యవహరిస్తుంటాడని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార చర్యలకు దిగితే బిఆర్ఎస్ కట్టకట్టుకుని జైల్లో ఊచలు లెక్కించాల్సి వుంటుంది.
సీఎం రేవంత్ రెడ్డిగారిని గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో వేధించిందని, ఇప్పుడు సీఎం గనుక ప్రతికార చర్యలకు దిగాలని భావిస్తే, వారు చేసిన అవినీతి, అక్రమాలకు అందరికందరు జైల్లో ఊచలు లెక్కించాల్సి వస్తుందని మంత్రి సురేఖ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాల విషయంలో చట్టబద్దంగా ముందుకుపోతున్న విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారని తెలిపారు.