బావమరిది కళ్లల్లో సంతోషం కోసం రేవంత్  రూ.8888కోట్ల కుంభకోణం

 బావమరిది కళ్లల్లో సంతోషం కోసం రేవంత్  రూ.8888కోట్ల కుంభకోణం

KTR Former Minister Of Telangana

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే.. ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల రూపాయల భారీ అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా ఈ కుంభకోణాన్ని చేశారని అన్నారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవీ కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకపోయినా వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారని విమర్శించారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి, ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని తెలిపారు.

పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారని కేటీఆర్‌ అన్నారు. ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమరిది జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకు తెరలేపారని తెలిపారు. 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20 శాతం పని చేస్తుందని, రేవంత్ రెడ్డి బావమరిది 80 శాతం వెయ్యి కోట్ల పని చేస్తుందని అంటున్నారని పేర్కొన్నారు. ఐహెచ్‌పీ అనే కంపెనీ ఈ మేరకు సెబీకి సమాచారం ఇచ్చిందని అన్నారు. ఈ కంపెనీని శిఖండి సంస్థగా అడ్డుపెట్టుకొని అనుముల రేవంత్ రెడ్డి, సూదిని సృజన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ కాంట్రాక్టులు కట్టబెట్టారని అన్నారు.

ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా ఈ భారీ అవినీతికి తెరలేపారని కేటీఆర్‌ అన్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం 7, 11, 13 నిబంధనల మేరకు రేవంత్ రెడ్డి విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పదవి కోల్పోతారని అన్నారు. తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరిస్తే, ఆశ్రితపక్షపాతం చూపిస్తే ఈ చట్టం ప్రకారం శిక్షార్హులేనని స్పష్టం చేశారు. ఇవే చట్టాల కింద సోనియా గాంధీ తన పదవిని కోల్పోయిందని గుర్తుచేశారు. 2006లో సోనియా గాంధీ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా పదవిలో ఉన్నందుకు ఈ చట్టం ప్రకారం తన పదవిని కోల్పోయిందని తెలిపారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా అక్రమ మైనింగ్ అనుమతులు తన కుటుంబ సభ్యులకు ఇచ్చినందుకు తన పదవి కోల్పోయారని గుర్తుచేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి 2011లో అశోక్ చవన్ ఆదర్శ కుంభకోణంలో తన పదవి కోల్పోయారని అన్నారు.

బావమరిది కళ్లల్లో సంతోషం కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కేటీఆర్‌ విమర్శించారు. తన ఇంట్లో లంకె బిందెలు నింపుకోవడం కోసం అక్రమ టెండర్లకు ముఖ్యమంత్రి తెరలేపారని తెలిపారు. రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో పిలిచిన 8,888 కోట్ల రూపాయల టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదని అన్నారు. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇవ్వాల్సిన గత్యంతరం వలన ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి దక్కిన వందల కోట్ల రూపాయల టెండర్ బయటకు వచ్చిందని తెలిపారు. వీటికి సంబంధించిన ఒక్క జీవో కూడా ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టడం లేదని అన్నారు. టెండర్ల తాలూకు పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి చేస్తున్న అనేక కుంభకోణాలకు సంబంధించిన వివరాలను ప్రజల ముందు వరుసగా ఉంచుతామని కేటీఆర్‌ తెలిపారు.కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఫోర్ బ్రదర్స్ సిటీ వంటి కుంభకోణాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. బావమరిదికి అమృతం పంచుతూ తెలంగాణ ప్రజలకు విషాన్ని పంచుతున్న రేవంత్ రెడ్డిని ప్రజల ముందు ఎండగడతామని స్సష్టం చేశారు. సృజన్ రెడ్డి కంపెనీకి ఉన్న లాభం కేవలం రెండు కోట్లే కానీ.. వెయ్యికోట్ల పనులు చేస్తుందని అంటున్నారని తెలిపారు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన ఐ.హెచ్.పీ కంపెనీ కేవలం 200 కోట్ల పనులు చేస్తుందంటున్నారని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *