ఏపీ కి జీవనాడి పోలవరం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు, అహంకారం, నిర్లక్ష్యంతో జీవశ్చవంగా మార్చింది. పోలవరానికి మళ్లీ జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వ ఏర్పాటు తరువాత సిఎంగా నా తొలి పర్యటన లో ప్రాజెక్టు వద్దకే వెళ్లాను. నాటి నుంచి గత 6 నెలలుగా పోలవరం చుట్టూ ముసురుకున్న సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించి జరుగుతున్నా నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ, విదేశీ నిపుణులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సిడబ్ల్యుసితో పాటు భాగస్వామ్య పక్షాలతో సుదీర్ఘ చర్చలు జరిపి పోలవరాన్ని గాడిన పెట్టాం. జనవరిలో కొత్త డయాఫ్రం వాల్ పనులు మొదలు పెడతాం. ఈసీఆర్ఎఫ్, డి వాల్ పనులతో పాటు కుడి ఎడమ కాలువల కనెక్టవిటీ పనుల పూర్తికి ప్రణాళిక సిద్దం చేశాము.
పునరావాసంతో సహా 2027 డిశంబర్ నాటికి ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు పూర్తి చెయ్యాలనేది అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా….2026 అక్టోబర్ నాటినే పోలవరం ఫలాలు రైతన్నలకు అందించేందుకు శక్తిమేర పనిచేస్తాం. ప్రతిఎకరాకూ నీళ్లు ఇవ్వాలనే మా సంకల్పం నెరవేరేలా దీవించాలని ప్రజలను, దేవుడిని ప్రార్థిస్తూ…చిత్తశుద్దితో,పట్టుదలతో అడుగు ముందుకు వేస్తున్నామని అన్నారు..