హారీష్ రావు హెచ్చరించిన పట్టించుకోని సర్కారు
తెలంగాణలో గత తొమ్మిది నెలలుగా మహిళలకు బాలికలకు భద్రత కరువైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా మండిపడ్డారు.
ఈమేరకు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని ధ్వజమెత్తారు.
ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో రెండు వేలకు పైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. హోం మంత్రిత్వ శాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆ ప్రకటనలో మండిపడ్డారు.