మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు తీవ్ర గాయం
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావుకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. నిన్న గురువారం సీపీ(సైబరాబాద్ )కార్యాలయంలో ధర్నాకు దిగిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందాన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు..
గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి హరీశ్‌రావును అదుపులోకి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ ఎక్కించే నేపథ్యంలో ఆయనను కర్కశంగా ఈడ్చిపడేశారు. ఇష్టమొచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్రగాయమైనట్టు తెలిసింది. హారీష్ రావుకు గాయం కావడంపట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల్లో కొందరు కావాలనే హరీశ్‌రావును గాయపర్చినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు. చేయి నొప్పి పెడుతున్నదని అరిచినా.. కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చిపడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్టు తెలిసింది… ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు.
బస్సులో గంటల తరబడి తిప్పారు. ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా.. ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ.. కేశంపేటకు చేరుకున్నారు.కేశంపేట పోలీస్‌స్టేషన్ లోపలికి తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టివేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైందని బీఆర్‌ఎస్ నేతలు చెప్పారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు పోలీసుల అదుపులో ఉన్న హరీశ్‌రావు.. తన వాహనంలో వెళ్తూ ప్రథమ చికిత్స తీసుకున్నట్టు తెలిసింది.