హారీష్ రావు దెబ్బకు కాంగ్రెస్ సెల్ఫ్ గోల్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్ధిపేట ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15లోపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికల్లో బరిలోకి దిగను అని సవాల్ విసిరారు. సవాల్ విసరడమే కాకుండా ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కు అగస్టు 15లోపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తే తన రాజీనామాను ఆమోదించాలని లేఖ కూడా రాసి ఇచ్చారు. తాజాగా గురువారం ఎంతో హాట్టహాసంగా కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రుణమాఫీలో భాగంగా ఏడు వేల కోట్లతో పదకొండున్నర లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసినట్లు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ … సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పుజయప్రకాష్ రెడ్డి,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎంపీ బలరాం నాయక్ ,ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దగ్గర నుండి ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మేము రుణమాఫీ చేశాము.. అందుకే సవాల్ విసిరిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మీడియా ముందు ఒకటే ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారు. అయితే హారీష్ రావు స్పీకర్ కు రాసిన లేఖలో కానీ మీడియాతో మాట్లాడిన మాటల్లో కానీ ఎక్కడ కూడా లక్షలోపు రుణాలను మాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించలేదు.. రెండు లక్షల రుణమాఫీతో పాటు ఆరుగ్యారంటీలను అమలు చేస్తేనే తను చేస్తానని క్లియర్ కట్ గా తెలిపారు.
రెండు లక్షల రుణమాఫీ చేయకపోగ.. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక.. లక్ష రూపాయల రుణమాఫీపై కూడా కొద్దిగా క్లారిటీ లేకుండా ముఖ్యమంత్రి దగ్గర నుండి ఎమ్మెల్సీ వరకు అందరూ హారీష్ రావును టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాట్లాడటం కాంగ్రెస్ నేతలు తమకు తాము సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయింది. ఎందుకంటే ఆగస్టు15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ ప్రకటించలేదు. ఈ నెలాఖరి వరకు లక్షన్నర రుణమాఫీ చేస్తాము.. ఆగస్టు నెల చివరకు మిగతా యాబై వేల రూపాయల రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు. అంటే హారీష్ రావు విసిరిన సవాల్ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదనే వాళ్ళే స్వయంగా చెప్పుకుంటున్నట్లు ఆర్ధమవుతుంది.. అందుకే హారీష్ రావు దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తాము సెల్ఫ్ గోల్ వేసుకుంది.