అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

revanth reddy anumula
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటపాటు ఆ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి విన్పించారు. ఆ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, నాటి సీఎం కేసీఆర్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆ నివేదికపై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు జూపల్లి, పొంగులేటి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులకు కౌంటరిచ్చారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణను దోచుకున్నారనే కదా కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకుందని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కేవలం దుర్బుద్ధితోనే నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల, ఇంజనీర్ల సూచనలను, సలహాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్టును రీడిజైన్ చేశారని తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ దగ్గర కట్టాలని ముందే నిర్ణయించుకున్నాక రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీని ఆయన నియమించారు.
ఆ నివేదిక వారికి అనుకూలంగా లేదని దాన్ని తొక్కిపెట్టి వాళ్లనుకున్న చోట ప్రాజెక్టును కట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే కదా తెలంగాణను తెచ్చుకుంది. ఏనుగులను తినేవాళ్ళు పోయారనుకుంటే పీనుగులను తినేవాళ్లు వచ్చారు” అని తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.