రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా బండి సంజయ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ వ్యవహరిస్తున్నారు అని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గౌడ్ ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ పై పోలీసుల దాడిపై ఆయన స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు కావాలని రైతులు ధర్నా చేసినప్పుడు మాట్లాడలేదు.. యువత రోడ్లపైకి వచ్చి ఉద్యోగాల కోసం పోరాడినప్పుడు స్పందించలేదు..
గురుకులాల టీచర్లు సీఎం ఇంటిముందుకెళ్ళి మరి నిరసనలు చేసిన కానీ సప్పుడు లేదు.. హైడ్రా కూల్చివేతలతో పేదల జీవితాలతో ఆడుకుంటున్నప్పుడు వాళ్లవైపు కనీసం కన్నెత్తి చూడలేదు. ఏదో ప్రైవేట్ గా చిన్న పార్టీ జరిగింది. అందులో విదేశీ మద్యం ఉందని నెపంతో పోలీసులు కేసు పెడితే దానిపై కేంద్రం హోం శాఖ సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ మాట్లాడటం విడ్డూరం. ఒకవైపు పోలీసులు కేవలం విదేశీ మద్యం వాడారనే కారణంతోనే.. పర్మిషన్ లేకపోవడంతోనే కేసులు పెట్టాము అని చెబుతున్నారు.
మరోవైపు బండి సంజయ్ అందులో డ్రగ్స్ వాడారని ఆరోపించడం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే హామీలపై ప్రజల దృష్టిని మరల్చడానికి మాట్లాడుతున్నారు. కేంద్ర హోం శాఖ సహయక శాఖ మంత్రిగా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా పని చేస్తున్నారు అని ఆయన అన్నారు.