బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్…!
బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరఫున బీఏసీ మీటింగ్‌లో డిమాండ్ చేశామని తెలిపారు. కానీ ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేశామని స్పష్టం చేశారు.రేపు అసెంబ్లీలో లగచర్ల అంశంపై చర్చకు డిమాండ్ చేశామని హరీశ్‌రావు తెలిపారు. ఒక రోజు ప్రభుత్వానికి, మరొక రోజు విపక్షానికి అవకాశం ఇవ్వడం సంప్రదాయమని పేర్కొన్నారు.
లగచర్ల అంశంపై చర్చకు పట్టుబట్టామని.. రైతులకు బేడీలు వేసిన అంశం తమకు చాలా కీలకమని బీఏసీలో తెలిపామని అన్నారు. కచ్చితంగా ఈ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశామని తెలిపారు. కానీ బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందని సీఎం వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఏసీ చెప్పినట్టే సభ నడుస్తుందని వివరించామన్నారు. హౌస్ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు.
బీఏసీపై తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగారని హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని తెలిపారని చెప్పారు. బీఏసీ లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశామని అన్నారు. పుట్టిన రోజులు, పెళ్లిలు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపైన అభ్యంతరం తెలిపామని పేర్కొన్నారు. కౌలు రైతులకు 12 వేల సాయం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన సభ వెలుపల ప్రకటన చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.