BRS కు ప్రతీది బ్యాక్ ఫైర్ అవుతుందా..?-ఎడిటరియల్ కాలమ్.

 BRS కు ప్రతీది బ్యాక్ ఫైర్ అవుతుందా..?-ఎడిటరియల్ కాలమ్.

Will everything backfire for BRS..?

తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ అంటే బీ(టీ)ఆర్ఎస్.. తెచ్చిన రాష్ట్రాన్ని పది ఏండ్లలోనే దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్ వన్ చేసిన పార్టీ అంటే బీఆర్ఎస్.. సాగునీటి రంగం నుండి కరెంటు వరకు.. సంక్షేమం నుండి అభివృద్ధి వరకు ఇలా ఏ రంగం తీసుకున్న కానీ ప్రతి రంగంలో అభివృద్ధి అంటే ఇలా చేయాలని చేసి చూపించిన పార్టీ బీఆర్ఎస్. అంతటి మహోన్నత చరిత్ర ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంగా గత ఎనిమిది నెలలుగా ఏమి చేసిన బ్యాక్ ఫైర్ అవుతుందా..?.. ఉద్యమ సమయంలో ఏ కార్యక్రమం చేసిన.. ఏ ధర్నా నిర్వహించిన.. ఏ పోరాటానికి పిలుపునిచ్చిన ఆ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, విద్యార్ధి, మహిళా ,కార్మిక, రైతు ఇలా అన్ని సంఘాలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు మద్ధతు తెలిపేవి… ఇప్పుడు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చేసే ఏ పోరాటానికైనా ఆ పార్టీ శ్రేణులు, సానుభూతి పరులు తప్ప ఎవరూ మద్ధతుగా నిలవడంలేదా.?..చేసే ప్రతిదీ బ్యాక్ ఫైర్ అవుతుందా…? అంటే కింద విశ్లేషణలో చూద్దాం…?

తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు జరిగి  డిసెంబర్ నెల మూడో తారీఖున విడుదలైన ఫలితాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు కాకుండానే డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు… ఎమ్మెల్యేలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున పోరాడాలనే కంటే పదేండ్లు అధికారంలో ఉండి ఒక్కసారిగా అధికారం కోల్పోయామనే బాధతో మాట్లాడినట్లుగా.. విమర్శించినట్లుగా రాజకీయ విశ్లేషకులతో పాటు మేధావులు, సామాన్యప్రజలకు అర్ధమవుతుంది.. ఎన్నికల్లో అధికారం కోసం ఎన్నో హామీలు ఇస్తాయి పార్టీలు.. ఇంకొన్ని పార్టీలు ఓ అడుగు ముందుకేసి ఫలానా నెల ఫలానా తారీఖున అది చేస్తాం.. ఇది చేస్తాము అని హామీలిస్తాయి.. అధికారంలోకి వచ్చాక అవి అమలు అవుతాయా..? లేవా అని ఏ పార్టీ ఆలోచన చేయదు.. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న చేస్తామన్నా రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని లేఖలు రాయడంతో పాటు మీడియా సమావేశంలో ఒకటే విమర్శలు. సవాళ్ళ పర్వం నడిచింది నిన్నమొన్నటి వరకు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడం.. తొలి క్యాబినెట్ లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన లేకపోవడం.. టెన్త్ పాసైన విద్యార్థినిలకు స్కూటీలు ఇవ్వడం. గ్రాడ్యుయేట్ పూర్తయిన వాళ్లకు లక్ష రూపాయలు.. మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఎన్నికల్లో ఓట్లు అడిగింది.. ప్రజలు కూడా పదేండ్లు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపింది అని చూడకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇద్దామన్నట్లు అధికారాన్ని కట్టబెట్టారు.. ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఒకటే డిమాండ్స్… మీడియా సమావేశాలు.. లేఖలు.. ధర్నాలు చేస్తూ ఎనిమిది నెలలుగా ఏదొక అంశంపై మీడియాలో కన్ఫడుతూనే ఉంది బీఆర్ఎస్ ..

అయితే ప్రజల కోసం ప్రజల తరపున ప్రతిపక్షంగా కొట్లాడటం.. సమస్యలపై ప్రజల గొంతును విన్పించడం తప్పు కాదు. అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ కుదురుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలపై ముఖ్యమంత్రికి… ఆయా శాఖలపై ఆయా మంత్రులకు ఓ అవగాహనా రావాలి.. సంబంధిత అధికారులతో సమావేశాలు కావాలి.. ఇలా ఒక్కటేమిటి వంద అంశాలు ఉంటాయి. ఆ అంశాలపై క్లారిటీ రావాలి.. ఇలా ఓ పెద్ద ప్రాసెస్ ఉంటుంది..ఇలా ప్రతిదీ ఆలోచించకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా తొలిరోజు నుండే అధికార కాంగ్రెస్ పార్టీపై యుద్ధం ప్రకటించింది. అనుకున్నదే తడవుగానే కాంగ్రెస్ పై ఏదోక అంశాన్ని లేవనెత్తుకుని నిత్యం మీడియాలో ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ లో పెద్ద యుద్ధమే చేస్తుంది. కానీ పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ చేస్తుంది అని కాదు. ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం మారినప్పుడు కాంగ్రెస్ కు సమయం ఇవ్వాలి..

కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశాన్ని కల్పించింది. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు,ఆసరా ,కళ్యాణ లక్ష్మీ పథకాలను అమలు చేస్తుంది.. ఉచిత కరెంటు ,ఐదోందలకు గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలను మాత్రమే అమలు చేస్తుంది. ఏడు నెలల్లోనే కాంగ్రెస్ ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చిందని కాదు. కానీ ఏ ప్రభుత్వానికి అయిన సమయం ఇవ్వాలి.. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడే ఎక్కుపెడితే ప్రజలు ఏమి తెలివి తక్కువాళ్ళు కాదు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన సంక్షేమాభివృద్ధి అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలోనూ.. డెబ్బై ఏండ్ల భారతంలో ఏ ప్రభుత్వం.. ఏ పార్టీ చేయలేదు.

అంతటి చరిత్ర ఉన్న ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు అంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాంతో ప్రణాళికలతో ముందుకు వెళ్లాలో ఆలోచించాలి.. ప్రజల ఆలోచనను పసిగట్టకుండా ప్రభుత్వాన్ని ఇరుకునపడేయాలని చేస్తున్న ప్రతీది మిస్ ఫైర్ అవుతుందని పొలిటీకల్ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన ఇందిరాపార్కు దగ్గర ధర్నా ఎత్తివేయడం.. ముందస్తు అరెస్టులు.. ఎమ్మెల్యేల చేరికలు ఇలాంటివే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. గతంలో మీరు చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అని ప్రజలు మేధావులు న్యూట్రల్ పీపుల్స్ గుసగుసలాడుకుంటున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అనే స్థాయిలో యుద్ధం జరిగింది అనడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టే క్రమంలో గతంలో బీఆర్ఎస్ చేసిన చేయనవి ఆరోపణలను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం ప్రజలు కూడా గమనిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక గత ఎనిమిది నెలల్లో మూడు నెలలు ఎన్నికల కోడ్ కిందనే పోయింది. ఏ కొత్త ప్రభుత్వం నిలబడటానికి కాస్త సమయం పడుతుంది. ఇది ఎవరూ కాదనలేరు. రెండొసారి ప్రభుత్వంలోకి వచ్చిన బీఆర్ఎస్ మంత్రివర్గం ఏర్పాటుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం తీసుకున్నది ప్రజలు అప్పుడే మరిచిపోలేదు. అలాంటిది గతంలో చేసినవి మరిచిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పై విరుచుకుపడటం బీఆర్ఎస్ పై ప్రజల్లో ఇంకా తీవ్ర వ్యతిరేకత రావడమే తప్పా కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం ఉండదు.

ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైన గౌరవించాల్సిందే.. ఎలా అయిన కానీ ఐదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది.ఈ ఐదేండ్లు ప్రజలకు నచ్చకపోతే తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఇంట్లో కూర్చోబెడతారు. ఇది రాజకీయ వ్యవస్థలో నిత్యం జరిగే పరిణామం.. బీఆర్ఎస్ అంటే తెలంగాణ పక్షం కోట్లాడే పార్టీ.. తెలంగాణను తెచ్చిన పార్టీ.. తెలంగాణలో అణువణువు తెల్సిన పార్టీ ఎవరూ కాదనలేరు. అలాంటప్పుడు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కు అధికార పక్షానికి సలహాలు.. సూచనలు ఇవ్వాలి. కానీ పది నెలల్లోనే ప్రభుత్వం విఫలమైందనో.. ఈ పార్టీకి అధికారంలో ఉండే అర్హత లేదనో విమర్శించకూడదు. అధికార పక్షం చెప్పినవన్నీ చేయడానికి ఇంకా ఐదేండ్లు సమయం ఉంది.. ఆ సమయంలో చేయకపోతే అప్పుడు ప్రజలు తీర్పునిస్తారు. అదేవిధంగా అధికార పక్షం సైతం ప్రతిపక్షం ఇచ్చే సలహాలను సూచనలను పరిగణలోకి తీసుకోవాలి.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఓవర్ నైట్ అమలు కావని ఇటు ప్రజలకు అటు బీఆర్ఎస్ కు మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ కు తెల్సు. ఎందుకంటే అవి అమలు కావాలంటే నిధులు కావాలి.. సమయం కావాలి. గత పదేండ్లలో బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలకు ఎంత సమయం పట్టింది.. ఎన్ని నిధులు అవసరం అయ్యాయో తెల్సు. అందుకే ప్రభుత్వానికి ఏడాది అయిన సమయం ఇవ్వాలి. ప్రజల మనసు గెలవాలంటే ప్రజల గుండెచప్పుడు తెలుసుకోవాలి.. ప్రజల మూడ్ ను తెలుసుకోవాలి.. వివేకం ఉండాలి. ఆలోచన ఉండాలి.. వ్యూహాం ఉండాలి.. ప్రణాళికలు ఉండాలి.. ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజల తరపున కొట్లాడాలి కానీ ఏడాది కూడా టైం ఇవ్వకుండా అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.

ఐదేండ్లు అధికార పక్షం ఎలా ఉంది.. ప్రతిపక్షం ఎలా ఉంది అని ఇవన్నీ గమనించిన ప్రజలు సమయం వచ్చినప్పుడు తీర్పునిస్తారు. ప్రతిపక్షం అంటే అధికార పక్షాన్ని ఇరుకునపెట్టడం కాదు. అధికార పక్షం లోపాలను ప్రజలకు ఆర్ధమయ్యేలా వివరిస్తూ పొరాడటం. అధికారంలో వచ్చిన వెంటనే అద్భుతాలు ఏమి జరగవు. అది ఏ ప్రభుత్వం చేయలేదు.అందుకే కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత కొట్లాడితే ప్రజలు.. ఇతర సంఘాలు, పార్టీల మద్ధతు బీఆర్ఎస్ కు వస్తుంది తప్పా ఇలా సమయం సందర్భం లేకుండా దొరికింది కదా అని ప్రతిదీ రాద్ధాంతం చేయాలనుకుంటే బ్యాక్ ఫైర్ తప్పా ఏమి లాభం ఉండదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *