ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రస్తుతం రాజీవ్ రతన్ తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన తీవ్ర గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందారు.
1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆయనే సారధ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, పైర్ సర్వీసెస్ డీజీగా, పని చేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వివిధ హోదాల్లో పని చేశారు.