కాంగ్రెస్ పాలనలో జీతం కోసం ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిందేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీతాలు కావాలంటే రోడ్డు ఎక్కాల్సిందేనా అంటూ మాజీ మంత్రి .. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు జీతాల కోసం నిమ్స్ లో ధర్నాకు దిగిన ఉద్యోగుల వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఎక్స్ లో “నిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా, వారిని రోడ్డెక్కే దుస్థితికి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎంతో అంకిత భావంతో ఆస్పత్రికి రాత్రింబగళ్ళు సేవలు అందిస్తున్న సిబ్బంది ప్రతి నెల జీతాలు కోసం చేతులు జోడించి అడగాల్సి వస్తున్నది. రోడ్డెక్కి పోరాటం చేస్తేతప్ప ప్రభుత్వం చెల్లించడం లేదు!.ఉద్యోగుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా? ఎన్నికల ముందు తీయటి మాటలు, ఇప్పుడేమో తీవ్రనిర్లక్ష్యం కాంగ్రెస్ మోసపూరిత పాలనకు ఇదే నిదర్శనం.
“ప్రతినెల మా జీతం మాకు ఇవ్వండి” అని ఉద్యోగులు రోడ్డెక్కి మొరపెట్టుకోవాల్సి రావడం శోచనీయం!.కష్టజీవుల న్యాయమైన హక్కులను కాలరాస్తూ, వారి కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయమా?.నిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని పోస్టు చేశారు.
