రేవంత్ రెడ్డి చేసింది చెబితే చెవుల నుండే రక్తమే వస్తుందా..?

Anumula Revanth Reddy
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెడును చెవిలో చెప్పాలి.. మంచిని మైకులో చెప్పాలి అని పెద్దలు చెబుతుంటారు. కానీ మన పార్టీ నేతలు.. కార్యకర్తలు మంత్రులు.. ఎమ్మెల్యే.. ఎంపీలు చెడునేమో మైకులో చెబుతున్నారు. మంచినేమో చెవిలో చెబుతున్నారు.
దేశంలో ఎక్కడ లేనివిధంగా రుణమాఫీ చేశాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాము. ఐదోందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. రెండోందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ను ఇస్తున్నాము. ఇవన్నీ చెప్పుకోవడంలో విఫలమయ్యాము అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేసిన మంచిని మైకులో చెప్పుకోవాలి..
చెడును చెవిలో చెప్పుకోవాలని అన్నారు. అసలు గత పద్నాలుగు నెలలుగా సీఎం గా రేవంత్ రెడ్డి చేసిన ఒక్క మంచి పని అయిన ఉందా..? . ఆసరా నాలుగు వేల రూపాయలిస్తామన్నారు. ఇచ్చారా..?. డిసెంబర్ తొమ్మిదో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా?. ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేలిస్తామన్నారు. ఇచ్చారా..?. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చారా..?.
రైతుభరోసా కింద పదిహేను వేలు ఇస్తామన్నారు. ఇచ్చారా..?. ఇవేమి అమలు చేయలేదు కానీ హైడ్రాతో హైదరాబాద్ మహానగరంలో పేదోళ్ళ ఇండ్లను కూల్చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారు. కరెంటు కోతలతో రైతులను రోడ్లపైకి మళ్లీ తెచ్చారు. నేతన్న గీత కార్మికుల ,ఆటోకార్మికుల చావులకు కారణమయ్యారు. తాజాగా ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఎనిమిది మంది చిక్కుకోవడానికి కారణమయ్యారు. ఇలా రేవంత్ రెడ్డి చేసిన చెడును చెప్పుకుంటే కండ్ల నుండి రక్తకన్నీరు కాదు చెవుల నుండి రక్తం కారుతుందని ఆయన హెద్దేవా చేశారు.
