ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా నిలవాలి
ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు బంగం వాటిల్లుతుందన్నారు.
గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల మెడికల్ క్యాంపును గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ” కేవలం వార్తలు, వృత్తే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా జర్నలిస్టులు చేపట్టడం అభినందనీయమన్నారు.
కొత్తగా ఏర్పడిన నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఇటీవల వనభోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని ఒకచోట కలవడం శుభ పరిణామం అని.. జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, కోశాధికారి గుండాల యాదగిరి, యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు ప్రఫుల్ కిల్లారు, శిల్పారెడ్డి, చేతన్ వీరమనేని, సీనియర్ మేనేజర్ రవి కిషోర్ రెడ్డి, పలువురు సీనియర్ జర్నలిస్టులు ,తదితరులు పాల్గొన్నారు