ఏడాదిలో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు….

 ఏడాదిలో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు….

ప్ర‌తి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ప్ర‌తి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్నామ‌ని.. దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో ఇందిర‌మ్మ ఇండ్ల మొబైల్ యాప్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇళ్ల నిర్మాణం ద్వారా పేద‌లకు ఆత్మ గౌర‌వాన్ని ఇందిరా గాంధీ క‌ల్పించార‌ని కొనియాడారు.


ఆత్మగౌరవంతో బ‌తకాల‌నుకుంటే సొంత ఇల్లు ఉండాల‌ని, ఆ కల నెరవేరాలనే ఇందిరా గాంధీ ఇళ్లు నిర్మించి ఇచ్చార‌ని సీఎం తెలిపారు.  దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేద‌ని చెప్ప‌గ‌ల‌న‌ని సీఎం అన్నారు. కూడు.. గూడు.. గుడ్డ‌…  నినాదాన్ని ఇందిరా గాంధీ ఆచ‌ర‌ణ‌లోకి తీసుకువ‌చ్చార‌న్నారు. సీలింగ్ యాక్ట్ ద్వారా గిరిజ‌నులు, ద‌ళితులకు మిగులు భూముల పంపిణీ చేప‌ట్టార‌ని,  ఇళ్ల నిర్మాణం చేప‌ట్టార‌ని సీఎం తెలిపారు. ఇందిర‌మ్మ హ‌యాంలో ఇంటి నిర్మాణానికి రూ.10 వేలు కేటాయిస్తే.. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు అది రూ.1.25 ల‌క్ష‌ల‌కు చేరింద‌ని… పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం ఇప్పుడు త‌మ ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌లు ఇస్తోంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఎటువంటి లోటుపాట్ల‌కు తావులేకుండా.. గ్రీన్‌ఛాన‌ల్ ద్వారా ల‌బ్ధిదారుల‌కు రూ.5 ల‌క్ష‌లు అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. తొలి ఏడాది సొంత స్థ‌లం ఉన్న‌వారికి ఇళ్లు మంజూరు చేస్తామ‌ని, దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, పారిశుద్ధ్య సిబ్బంది, ద‌ళితులు, గిరిజ‌నులు, వితంతువులు,  ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరా గాంధీ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న‌ప్పుడు, ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న కాలంలో గిరిజ‌నుల‌కు ఇళ్లు కేటాయించార‌ని, ఆ త‌ర్వాత వారికి ఇళ్ల కేటాయింపు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌లేద‌ని సీఎం అన్నారు. త‌మ ప్ర‌భుత్వం ఐటీడీఏల ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాలు, ప్రాంతాల్లోని గిరిజ‌నుల కోసం ఇందిర‌మ్మ ఇళ్ల కేటాయింపులో ప్ర‌త్యేక కోటా ఇస్తుంద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. 

న‌ల్ల‌మ‌ల్ల‌లోని చెంచులు… ఆదిలాబాద్‌లోని గోండులు… భ‌ద్రాచ‌లంలోని కోయ‌లు.. ఎవ‌రైతే తెలంగాణ మ‌ట్టి మ‌నుషులో.. తెలంగాణ మూల పురుషులో వారికి ఇందిర‌మ్మ ఇళ్ల‌ను ప్ర‌త్యేకంగా కేటాయిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంద్ర‌వెల్లికి వెళ్లి తాను స్వ‌యంగా ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణ ప‌ట్టాలు అంద‌జేసిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంలో ఈ న‌మూనానే పాటించాల‌ని తాము సూచించ‌డం లేద‌ని, అదే స‌మ‌యంలో త‌మ‌కున్న స్థ‌లంలో ప్ర‌తి అంగుళాన్ని ల‌బ్ధిదారులు వినియోగించుకునేలా ప్ర‌తి మండ‌ల కేంద్రంలో మోడ‌ల్ హౌస్‌లు నిర్మిస్తామ‌ని.. ల‌బ్ధిదారులు త‌మ అవ‌గాహ‌న కోసం వాటిని చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ల‌బ్ధిదారులు త‌మ స్థోమ‌త‌కు త‌గ్గ‌ట్లు అద‌న‌పు గ‌దులు నిర్మించుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్నామ‌ని సీఎం చెప్పారు…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *