1,864 సర్కారు స్కూళ్లను మూసేసే కుట్ర
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపుగా 1,864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసి వేయాలని భావిస్తుండటం సిగ్గుచేటన్నారు. 2024లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 2.4 లక్షలు తగ్గింది.
ఇది రాష్ట్ర విద్యారంగానికి ప్రమాద సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. 8 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు. అసలు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్రావస్థలో ఉండటంతోనే ఈ దుస్థితి దాపురించిందన్నారు.