యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లు ఒకే..! మరి గురుకులాలు..?
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ తదితర వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో తీసుకోచ్చిన సరికొత్త కార్యక్రమం ఒకే చోట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున దాదాపు రూ. 120కోట్ల నుండి రూ.150కోట్ల వ్యయంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఈ క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ క్యాంపస్ ద్వారా దాదాపు రెండున్నర వేల మంది విద్యార్థులు చదువుకోనున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.
ఈ నిర్ణయం చాలా మంచిది. దేశంలోనే పేద వర్గానికి చెందిన ప్రజలు తమ సంపాదనంత తమ పిల్లల చదువులకు.. వైద్యానికే ఖర్చు చేస్తుంది అని అనేక నివేదికలు చెబుతున్నాయి.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకోచ్చిన ఈ సరికొత్త స్కూళ్ల ఏర్పాటు పేద విద్యార్థులకు సరైన విద్య.. అన్ని మౌలిక సదుపాయాలు అందితే అందరూ సంతోషిస్తారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు నాలుగు వందలకు పైగా గురుకులాల సంగతి ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎందుకంటే గత పది నెలలుగా గురుకులాల్లో అనేక చోట్ల వసతులు సరిగా లేవు.. నాణ్యమైన ఆహారం అందటం లేదు.. విద్య సరిగా లేదు.. పురుగులు పడిన అన్నం పెడుతున్నారు. తమ చేత అన్ని రకాల పనులు చేయిస్తున్నారు..గురుకులాల్లో అనారోగ్య సమస్యలతో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు.. కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని విద్యార్థులే ధర్నాలకు దిగుతూ రోడ్లపైకి వచ్చిన సంఘటనలను మనం చూశాము.. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏకంగా గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీ కూడా వేసింది. గురుకులాల పరిస్థితులపై.. విద్యార్థులకు అందుతున్న విద్య,సదుపాయాల అధ్యాయానికి.
ఒకవైపు గురుకులాలను భ్రష్టుపట్టిస్తూ మరోవైపు ఈ సరికొత్త కార్యక్రమం ఎందుకని మేధావులతో పాటు ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నల వర్షం. ఉన్న గురుకులాలను మెరుగుపరుస్తూ తాము అనుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల విషయంలో ముందుకెళ్తే అందరికి ఉపయోగం తప్పా గురుకులాలను ఆగం చేస్తూ తాము అనుకున్న దారిలో వెళ్తే కొండ నాలుకకు ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడుతుందన్నట్లు గురుకులాలు కూడా పేద విద్యార్థులకు దూరమై నాణ్యమైన విద్య అందదని విశ్లేషకుల అంచనా..?