రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా కాదు మనిషిలా పని చేయ్..!

Work like a human being, not like a real estate broker..!
రోజుకు పద్దెనిమిది గంటలు తెలంగాణ రాష్ట్రం కోసం పని చేస్తున్నాను అని మాటలు చెప్పుడు కాదు ఓ పదినిమిషాలు మనిషిలా పని చేయ్ అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” రోజుకి పద్దెనిమిది గంటలు పని చేస్తున్నాను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఓ పది నిమిషాలు మనిషిలా ఆలోచించండి.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా పద్దెనిమిది గంటలు పని చేయచ్చు..ఇరవై గంటలు పని చేయచ్చు కానీ ఓ పది నిమిషాలు ఓ మనిషిలా.. ఓ తండ్రిలా.. ఓ తాతలా హైదరాబాద్ భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి పని చేయండి అని ముఖ్యమంత్రికి నేను చెబుతున్నాను. నేను సూటిగా అడుగుతున్న ఆ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి అని పెద్దలు చెబుతున్నారు. అది ప్రభుత్వ భూమే అయితే ఆర్ధరాత్రి దొంగలు పడినట్లు యూనివర్సిటీలో పడి వందలాది జేసీబీలతో విధ్వంసం ఎందుకు చేస్తున్నారు.
రాజులాగా పట్టపగలే చేయచ్చు కదా చేసే పని అని సూటిగా ప్రశ్నించారు. మీరు నాలుగు కోట్ల ప్రజలకు ప్రజాప్రతినిధివి అనే సోయిలోకి వచ్చి పని చేయండి. మీకు కొంచమైన ఇంగిత జ్ఞానం ఉందా.. విద్యార్థులను గుంట నక్కలు అని అంటారా.. వారు చేసే ఉద్యమాన్ని హేళన చేస్తారా.. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానీయా కాకతీయ నిజాం యూనివర్సిటీ విద్యార్థులపై ఇలాగే దాడులు చేసిన ముఖ్యమంత్రుల పరిస్థితి ఏమైందో తెల్వదా నీకు అంటూ ఘాటుగా స్పందించారు.