ఈగో హర్ట్ అయితే అరెస్ట్ చేస్తారా…?-ఎడిటోరియల్ కాలమ్..!
ఎనుముల వారి ఈగో హర్ట్ అయ్యింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. ఎన్నో కలలు కని, తన కళలు ప్రదర్శించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన రేవంత్ రెడ్డిని ఒక స్టార్ హీరో సినిమా వేదిక మీద తన పేరు తెలియక తడబడటంతో పాపం చిన్నబుచ్చుకున్నట్టున్నాడు! ఈగో హర్ట్ అయినట్టుంది. అందుకే కావొచ్చు ఈ హెచ్చరికతో కూడిన అరెస్టు!సినీ ఇండస్ట్రీ తనను ముఖ్యమంత్రిగా గుర్తించి ముఖ్య అతిథిగా పిలవడం లేదన్న వెలితి ఆయనను నిత్యం వెంటాడుతూనే ఉంది.పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శించిన ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే తల్లి ప్రాణాలు కోల్పోయిన వార్త అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఆ దుర్ఘటన జరగకపోయి ఉంటే బాగుండని అందరం బాధపడ్డాం.
మాజీ మంత్రి కేటీఆర్ చెప్పినట్టు ఆ ఘటనకు పరోక్షంగా అల్లు అర్జున్‌నే దోషిగా గుర్తిస్తే, రాష్ట్రంలో హైడ్రా వల్ల ఆగిన గుండెలు, గురుకులాల్లో మరణించిన 48 మంది విద్యార్థులు, సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్యకు కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది కదా? అలా అయితే, సీఎం రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలన్నమాట?.గతంలో ఎన్నో సినిమాల రిలీజ్ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్ కొట్టి, థియేటర్‌లో తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు ఎందరో మరణించారు. అప్పుడు కూడా ఇలాగే హీరోలను దోషులుగా చేసి అరెస్టు చేశారా? రాజకీయ పార్టీల సభలకు వెళ్తూ, వస్తూ ప్రమాదాలు జరిగి కూడా ఎందరో మరణించారు. అప్పుడు ఆ సభలు నిర్వహించిన నాయకులను బాధ్యులను చేశారా?
ఈ దుర్ఘటనలో అల్లు అర్జున్ నైతిక బాధ్యత వహిస్తూ తన వ్యక్తిగతంగా రూ.25 లక్షల నష్టపరిహారంతో పాటు, పిల్లల వైద్య, విద్యా ఖర్చులు భరిస్తామన్నారు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేం. బాధ్యత గల పౌరుడిగా, లక్షలాది మంది అభిమానులు అనుసరించే హీరోగా అల్లు అర్జున్ ఒక ఆదర్శవంతమైన ప్రకటన చేశారు.రేవంత్‌రెడ్డి గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, మీరు గొప్పగొప్ప పనులు చేసేదాకా మీరు గుంపులో ఒకడిగానే మిగిలిపోతారు. కానీ, గొప్పగా గుర్తింపు పొందలేరు. ప్రముఖులు మిమ్మల్ని గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి, గౌరవించాలంటే అంతే గొప్పగా మీ పాలన, మీ నడవడిక, మీ భాష ఉండాలి. కానీ, కక్ష కట్టి, కత్తిపెట్టి గౌరవ మర్యాదలు బలవంతంగా లాక్కుంటే వచ్చేవి కావని గ్రహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సినీ ఇండస్ట్రీని గిల్లడం పరిపాటి అయింది. సినీ ఇండస్ట్రీలో ఇచ్చే నంది అవార్డు పేరు బలవంతంగా మార్చడమే కాకుండా ఆయన మాటనే శాసనం అంటూ టాలీవుడ్ సైతం ఒప్పుకోవాలని వేదికల మీద చిరంజీవి లాంటి స్టార్ హీరోలను బలవంత పెట్టారు.
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖ హీరోయిన్ల వ్యక్తిత్వ హననం చేశారు. స్వయంగా బాధ్యత గల మంత్రులు కొండా సురేఖ లాంటివాళ్లే స్టార్ హీరోయిన్లకు అక్రమ సంబంధాలు అంటకట్టి ఆఖరికి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. హైడ్రాకు ప్రచారం కరువైన సమయంలో సంచలనం కోసం హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టారు. ఇప్పుడు స్టార్ హీరో అల్లు అర్జున్‌పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇలా ఇండస్ట్రీపై ఆధిపత్యం కోసం, తన ప్రతాపం చూపడం కోసం వేధిస్తూనే ఉన్నారు.
ఇదంతా చూస్తుంటే పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సినిమా ఇండస్ట్రీ జోలికి వెళ్లి తెచ్చుకున్న పరిస్థితే రేవంత్‌రెడ్డి ఏరికోరి తెచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. గతంలో టికెట్ రేట్ల పెంపుపై టాలీవుడ్ స్టార్ హీరోలను తన చాంబర్‌కు రప్పించుకొని చిరంజీవితో చేతులు జోడించి మొక్కించుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాటలో రేవంత్‌రెడ్డి నడుస్తున్న ఆనవాళ్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. తన అహం నెగ్గించుకోవడం కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకున్న ఏ ముఖ్యమంత్రి పొడుగెల్లినట్టు చరిత్రలో లేదు.
తెలంగాణ వచ్చిన కొత్తలో ఆంధ్రా డామినేషన్ ఉన్న టాలీవుడ్ తరలిపోతుందని ఎన్నో అపోహలు ప్రచారం చేసినా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, ముందుచూపు, కళలపై వారికున్న అవగాహన, మక్కువ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ ఎంతగానో వృద్ధి చెందింది. తెలంగాణ యాస, భాష సైతం సినిమాల్లో ఎంతగానో పరిఢవిల్లింది. పదేండ్లు ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో ఆత్మగౌరవంతో సినిమా పండుగలా సాగింది. కానీ, మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ అవమాన భారంతో ‘ఉందునా! ఊకుందునా! ఊరుదాటి పోదునా’ అన్నట్టు తయారైంది.
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి రాజకీయ గురువు చంద్రబాబు పదేపదే తెలుగు సినీ పరిశ్రమ అమరావతికి తరలిరావాలన్న ప్రయత్నానికి, ఇండస్ట్రీ కోరిన రాయితీ ఇస్తానని ప్రకటిస్తున్న తాయిలాలకు మద్దతుగా రేవంత్ రెడ్డి చర్యలు, పాలసీలు, ప్రవర్తనలు ఉన్నాయి. చంద్రబాబు కోరిక తీర్చడం కోసం సినీ ఇండస్ట్రీని తరలించేందుకు రేవంత్ రెడ్డి తన వంతు కృషి చేస్తున్నారా? అన్న అనుమానం కలుగుతున్నది. గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడం కోసమేనా ఈ ఆరాటం? ఈ చర్యలు చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది.
-ఏనుగుల రాకేష్‌రెడ్డి (వ్యాసకర్త: బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు)