మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం..!

 మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం..!

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. “ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది” అని అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, మూసీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లా సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. ఇంకా ఏమన్నారంటే…మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండ ప్రజలు జీవించలేని పరిస్థితులు తలెత్తబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఫ్లోరైడ్ బారిన పడి నల్గొండ ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు. మూసీలో కొట్టుకొచ్చే శవాలు, కళేబరాల నుంచి విముక్తి కలిగించి ఈ జిల్లాలో వ్యవసాయానికి, తాగునీటికి ఉపయోగపడే విధంగా గోదావరి నుంచి నీటిని తరలించి కృష్ణా నదిలో కలిసే వరకు ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలను ప్రవహింపజేసి దేశానికే తలమానికంలా నిలబెట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ప్రపంచంలోనే పొడవైన 44 కిలోమీటర్ల ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పూర్తి చేసి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీటిని ఇవ్వాలని ఆనాడు ప్రణాళికలు సిద్దం చేశాం. బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించాం. కానీ గడిచిన పదేళ్ల ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా పోరాటాల గడ్డ నల్గొండ జిల్లాలో ఉత్సవాలు చేసుకోవడం సంతోషకరం.

21 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ చేశాం. ఒక్క నల్గొండ జిల్లాలోనే 2400 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది.66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు రూ. 500 బోనస్ ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ పరంగా 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఏ రాష్ట్రానికి లేదు.నల్గొండ రింగ్ రోడ్డును పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర్ రాజనర్సింహ , తుమ్మల నాగేశ్వరరావు , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *