చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి దగుల్బాజీ పనులు-రేవంత్ రెడ్డిపై రాజా వరప్రసాద్ ఫైర్
తెలంగాణలో గత పదకొండున్నర నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన హనీమూన్ ముగిసిందని ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్న వేళ ప్రజలకు ఏం మంచి చేశారని? ఏ మొహం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబరాలు జరుపుకుంటారని రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ (స్వామీ) ప్రశ్నించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. గత పదకొండున్నర నెలల పాలన పూర్తి అయ్యిందని ఇందులో అన్ని ప్రభుత్వ శాఖలు మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని అన్నారు.
ముఖ్యమంత్రి తన వద్ద పెట్టుకున్న హోం శాఖ, విద్యాశాఖ తదితర ముఖ్యమైన శాఖలను ఆయన వద్ద పెట్టుకుని ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. ఇక వ్యవసాయ, రెవిన్యూ, పంచాయతీరాజ్, పౌరసరఫరాల శాఖలు కూడా ఘోరంగా విఫలమయ్యాయని, ప్రజలకు ఏం మంచి చేశారని ఏడాది సంబరాలకు సిద్ధం అవుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించిన రేవంత్ రెడ్డి వాటిని మరిచిపోయారని అన్నారు. చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి దగుల్బాజీ పనులని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కడుపు రగిలిన ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.
ప్రశ్నిస్తే స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్న వారిని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని పూర్తి దిగజారుడు రాజకీయాలకు పూనుకుంటున్నారని విమర్శించారు.రాష్ట్రంలో కరెంటు సమస్య పునరావృతమవుతున్నదని, అదేవిధంగా శాంతిభద్రతలు క్షీణించాయని… ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని గల్లా పట్టి ప్రశ్నించే రోజులు మున్ముందు ఉన్నాయని హెచ్చరించారు. పేదోడి ఆక్రోశాన్ని రాజకీయంగా చూస్తే సర్వనాశనం అయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని హెచ్చరించారు.
కొడంగల్ నియోజకవర్గంలో పేద ప్రజల భూములను లాక్కునేందుకు రేవంత్ రెడ్డి అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఏ హోదాలో అధికార లాంఛనాలతో తిరుగుతున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ స్థాయి అధికారులు కూడా తిరుపతిరెడ్డికి వంగి సలాములు కొడుతున్నారని ఇదేం ప్రజాపాలనో అర్థం కావడం లేదని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ గిరిజన నాయకుడు చందు నాయక్ పాల్గొన్నారు..