జగన్ ,షర్మిల మధ్య ఆస్తి వివాదం ఏంటీ…?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డిల మధ్య వివాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము… నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన చెల్లి వై.ఎస్.షర్మిల, తల్లి వై.ఎస్. విజయమ్మలపై ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లను తన చెల్లి వై.ఎస్. షర్మిల, తల్లి వై.ఎస్.విజయమ్మ ద్వారా చట్ట వ్యతిరేకంగా మోసపూరితంగా బదలాయించుకున్నారన్నది ఈ ఫిర్యాదు సారాంశం. కేసు వాస్తవాలు ఇలా ఉన్నాయి…
1. షర్మిల, జగన్ వేర్వేరుగా తమదైన జీవితాలను గడుపుతున్నారు. వేర్వేరుగానే వ్యాపారాలు చేసుకుంటున్నారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించేందుకు ముందు కూడా పరిస్థితి ఇలాగే ఉండింది. 2. వై.ఎస్.రాజశేఖర రెడ్డి బతికి ఉన్నం సమయంలోనే ఆయన సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు.. తండ్రి తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు అన్నింటినీ వై.ఎస్.జగన్, వై.ఎస్.షర్మిలకు సమానంగా, న్యాయబద్ధంగా పంపిణీ చేశారు. 3. వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించిన పదేళ్ల తరువాత అన్నగా తన చెల్లి వై.ఎస్.షర్మిలపై ముందునుంచి ఉన్న అపారమైన ప్రేమ, ఆప్యాయతల కారణంగా తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లో కొన్నింటిని భవిష్యత్తులో బదలాయించే ఉద్దేశాన్ని వై.ఎస్.జగన్ వ్యక్తం చేశారు. ఇందుకు ఏ రకమైన ఆర్థిక ప్రతిఫలాన్ని ఆయన ఆశించలేదు. కుటుంబంపై తనకున్న ఆప్యాయతను వ్యక్తం చేయడం ఒక్కటే ఆయన ఉద్దేశం. దశాబ్ద కాలంగా చెల్లికి తల్లి ద్వారా ఇచ్చిన రూ.200 కోట్లకు అదనంగా తను సొంతంగా సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. 4. సొంత ఆస్తుల్లో కొంత భాగం చెల్లికి ఇవ్వాలన్న ఉద్దేశాన్ని వ్యక్తంచేసేందుకు నమ్మకం కల్పించడానికి జగన్ మోహన్ రెడ్డి ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
సరస్వతి పవర్ కంపెనీతోపాటు తాను సొంతంగా సంపాదించుకున్న ఇతర ఆస్తుల్లో కొంత భాగం ఆమెకు ఇచ్చేలా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా సరస్వతి పవర్ కంపెనీ షేర్లు కొన్నింటిని తల్లి వై.ఎస్.విజయమ్మకు కేటాయిస్తూ వై.ఎస్.జగన్ ఒక గిఫ్ట్‌డీడ్ ఇనీషియేట్ చేశారు. న్యాయస్థానాల్లో ఉన్న కేసులు పరిష్కారమైన తరువాత మాత్రమే షేర్ల బదలాయింపు జరుగుతుందన్న షరతు కూడా ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ఉంది. 5. అప్పటికే కొన్ని కేసుల విచారణ కొనసాగుతున్న కారణంగా, ఒప్పందంలో పేర్కొన్న ఆస్తులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సీబీఐ అటాచ్‌మెంట్‌లో ఉన్న నేపథ్యంలో అవన్నీ పరిష్కారమైన తరువాత మాత్రమే షేర్ల బదలాయింపు జరుగుతుందని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేసుల విచారణ పూర్తి కాకుండా షేర్ల బదిలీ సాధ్యం కాదని న్యాయ నిపుణులు కూడా చెప్పడం ఒప్పందంలో పేర్కొన్న అంశానికి బలం చేకురుస్తుంది.
ఒప్పందం కుదిరే నాటికి వై.ఎస్.షర్మిలకు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు. కేసుల విచారణ పూర్తి కాకుండానే షేర్లు బదలాయింపు జరిగితే వై.ఎస్.జగన్‌కు న్యాయపరమైన చిక్కులే కాకుండా… ఇచ్చిన బెయిల్ రద్దు అయ్యే ప్రమాదం ఉందన్నది కూడా ఆమె అవగాహనలోని విషయమే. 6. కాలక్రమంలో వై.ఎస్.షర్మిల తెలంగాణలో సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించింది. తరువాతి కాలంలో ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంంది. ఈ పరిణామం కాస్తా వై.ఎస్.జగన్‌తో రాజకీపరమైన అంతరం పెరిగేందుకు కారణమైంది. 7. కోర్టు బెయిల్ షరతుల నేపథ్యంలో ఆస్తుల బదలాయింపు సాధ్యం కాదన్న విషయం, ఒకవేళ జరిగితే అన్న బెయిల్ రద్దు అయ్యే ప్రమాదం ఉందన్నది వై.ఎస్.ఫర్మిలకు స్పష్టంగా తెలిసినప్పటికీ.. తల్లి విజయమ్మ పేరిట షేర్లను బదలాయించుకున్నారు. షేర్ల బదలాయింపు దరఖాస్తులోకానీ, ఒరిజన్ షేర్ సర్టిఫికెట్లు అందించకుండానే ఈ మార్పిడి జరిగిపోయింది.
షేర్ సర్టిఫికెట్లు ఎక్కడో కనిపించకుండా పోయాయని విజయమ్మతో తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించడం ద్వారా ఈ బదలాయింపు చేయించుకున్నారు. షేర్ సర్టిఫికెట్లు అన్నీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి దగ్గరే ఉన్న విషయం వై.ఎస్.షర్మిలకు స్పష్టంగా తెలిసినా దీనికి పాల్పడ్డారు. 8. ఈ చర్యల కారణంగా వై.ఎస్.జగన్ ఎదుర్కొంటున్న కేసులు మరింత సంక్లిష్టమయ్యాయి. షర్మిల చేసిన పనులు, జప్తు చేసిన ఆస్తుల భవిష్యత్ బదలాయింపులకు సంబంధించి గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకూ భిన్నం. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిసినప్పటికీ టీడీపీ, చంద్రబాబు నాయుడుల ట్రాప్‌లో పడిషర్మిల దురుద్దేశాలతో షేర్లను బదలాయింపు చేసుకుంది. 9. షర్మిల చేసిన పని న్యాయపరంగా వై.ఎస్.జగన్‌ను చాలా ఇబ్బదికరమైన పరిస్థితిలోకి నెట్టింది. కోర్టు నిబంధనలకు అనుగుణంగా ఈ ఆస్తులను బదలాయించ రాదు.
షర్మిల అక్రమంగా షేర్లను బదలాయించడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎన్నో వస్తాయని వై.ఎస్.జగన్ న్యాయవాదుల బృందం హెచ్చరించడం… ఈ పరిస్థితిని రాజకీయ ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారని తెలిసిన నేపథ్యంలోనే వై.ఎస్.జగన్ బరువెక్కిన గుండెతోనే తనకు చెల్లి వై.ఎస్.షర్మిలకు మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదన్న విషయాన్ని స్పష్టం చేసేందుకు మాత్రమే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. 10. షేర్ల బదలాయింపు జరిగిందని తెలిసిన వెంటనే వై.ఎస్.జగన్ దానిపై తన అభ్యంతరాన్ని స్పష్టం చేయడంతోపాటు న్యాయపరమైన చిక్కుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. 11. ఇన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా.. బాధ్యతారహితమైన ప్రకటనలు చేసినా, చర్యలకు పాల్పడినా చెల్లి వై.ఎస్. షర్మిల వైఖరిలో సానుకూల మార్పు వస్తే, చెల్లిపై తనకు మళ్లీ ప్రేమ, ఆప్యాయతలు కలిగితే భవిష్యత్తులోనైనా (కేసుల పరిష్కారం తరువాత) తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లో కొంత భాగాన్ని ఇవ్వడానికి తాను సుముఖంగానే ఉన్నట్లు వై.ఎస్.జగన్ చెబుతున్నారు.
కేసుకు సంబంధించిన ముఖ్యాంశాలు… 12. సరస్వతి పవర్ కంపెనీ కానీ.. అవగాహన ఒప్పందంలో పేర్కొన్న ఇతర ఆస్తులు కానీ.. ఏవీ కుటుంబ వారసత్వ ఆస్తులు కాదు. జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు మాత్రమే. 13. ఈ ఆస్తులు ప్రస్తుతం జప్తులో ఉన్నాయి. న్యాయస్థానాల్లో కేసులు పరిష్కారమయ్యే వరకూ వీటిని బదలాయించడం సాధ్యం కాదు. – న్యాయపరంగా ఉన్న ఈ చిక్కు గురించి స్పష్టంగా తెలిసినప్పటికీ.. కోర్టు నియమాలను ఉల్లంఘిస్తూ షేర్లను తల్లి వై.ఎస్.విజయమ్మ పేరుపై బదలాయించింది. – ఈ పరిణామంతో షాక్‌కు గురైన వై.ఎస్.జగన్ న్యాయపరంగా తానున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, తనను తాను రక్షించుకునేందుకు, విశ్వాసంతో న్యాయస్థానానికి వివరాలు తెలపాల్సిన అవసరం ఏర్పడింది. 14. సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించిన గిఫ్ట్‌డీడ్ 2021లో ఇనీషియేట్ అయ్యిందికానీ, షేర్ల బదలాయింపు కంటే ముందు న్యాయపరమైన వ్యవహారలన్నీ ఒక కొలిక్కి రావాలన్న ఉద్దేశంతో వై.ఎస్.జగన్ ఆస్తి బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయలేదు.
15. వై.ఎస్.షర్మిల దురుద్దేశంతో అన్న శ్రేయస్సును, న్యాయపరమైన చిక్కులను విస్మరించి షేర్లను బదలాయింపజేసుకున్నారు. న్యాయపరంగా ఈ చర్యలు సరికాదని షర్మిలకు ఎప్పటికప్పుడు సలహా, సూచనలు అందినప్పటికీ ఆమె షేర్ల బదలాయింపునకే మొగ్గు చూపారు. తద్వారా ప్రేమానురాగాలతో తనంతట తాను ఆస్తులు పంపిణీకి ఒప్పందం కుదుర్చుకున్న వై.ఎస్.జగన్ నమ్మకాన్ని వై.ఎస్.షర్మిల వమ్ము చేసినట్లు అయ్యింది. అందుకే బాధాకరమైన అయినప్పటికీ స్పష్టంగా ఉన్న షరతులకు అనుగుణంగా యథాతథ స్థితిని ఏర్పాటు చేయాలని వై.ఎస్.జగన్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది అని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.