ఉద్యమంలోనే భయపడలే..! ప్రతిపక్షంలో భయపడతామా..?

తెలంగాణలో అధికారంలోకి వచ్చి పదిహేను నెలలవుతున్న ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు మాజీ మంత్రి… బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుపై కేసు పెట్టారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. నాడు రుణమాఫీ చేయకుండా రైతులను నయవంచన చేసిన రేవంత్ రెడ్డి పాపం, రాష్ట్ర ప్రజలకు శాపం కావొద్దని యాదాద్రి లక్ష్మి నరసింహా స్వామి వద్ద పాప పరిహారం పూజలు చేసినందుకు మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు పెట్టారు.
నేడు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను కాపాడటంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయ్యిందని అన్నందుకు, 14 నెలల కాంగ్రెస్ పాలనలో 4 ప్రాజెక్టులు కుప్పకూలాయని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద మాట్లాడినందుకు బాచుపల్లి పోలీస్‌ష్టేషన్‌లో హరీశ్‌రావుపై మరో కేసు నమోదు చేశారని ఆయన విమర్శించారు. ఎన్ని పోలీసు స్టేషన్లలో ఇంకా ఎన్ని కేసులు పెడతావు అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
తెలంగాణ ఉద్యమ యోధుడు, ప్రజల తరుపున నిన్నూ, నీ ప్రభుత్వాన్ని అనుక్షణం నిలదీస్తున్న ప్రజా నాయకుడు హరీశ్ రావు అని సీఎం రేవంత్ రెడ్డికి ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. హరీశ్ రావుపై అక్రమ కేసుల దాడి, ప్రశ్నించే స్వేచ్ఛపై దాడి, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రలతో తెలంగాణ పోరాట యోధుడిని భయపెట్టలేరని.. అక్రమ కేసులతో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. తమకు కేసులు కొత్తకాదు, పోలీసు స్టేషన్లు కొత్తకాదని.. ప్రజల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం దేనికైనా రెడీ అని తెలిపారు.
