హోదా మాత్రం మండలి చైర్మన్…. కానీ…?
తెలంగాణ రాష్ట్ర మండలి విప్ గా మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఈ రోజు బుధవారం అసెంబ్లీలో పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ విప్ గా చూడాల్నా…?. కాంగ్రెస్ విప్ గా చూడాల్నా అని అక్కడున్న విలేఖర్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్దిని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ మహేందర్ రెడ్డిని ఆఫిషియల్ విప్ గా చూడాలని చాలా తెలివిగా ఆయన సమాధానమిచ్చారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” నేను బీఆర్ఎస్ చైర్మన్ కాదు.. మండలి చైర్మన్ ను.. ఒక్కసారి మండలి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాక నాకు ఏ పార్టీతో సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. ఇంతవరకూ బాగానే ఉంది. అసలు కథ ఇక్కడే మొదలైంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంకా మీడియాతో మాట్లాడుతూ ” ఉద్యోగాలపై మాట్లాడుతున్న బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారు.. మూసీ నది ప్రక్షాళనపై ఇంకా డీపీఆర్ ఖరారు కాలేదు. అప్పుడే రాజకీయ విమర్శలు ఎందుకు..?. నాడు టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఏమి చేశారు.
అప్పుడు ఒక న్యాయం .. ఇప్పుడు ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. హైడ్రా వల్ల హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.. ఆదాయం తగ్గిందనడం కరెక్టు కాదు.. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉంది.. హైడ్రా పై బీఆర్ఎస్ వాళ్లు రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వాడుకున్న ఇంకా ఏమి వాడుకున్నా వాళ్లు అధికారంలోకి రారు. ప్రభుత్వం అన్నాక ప్లస్ ఉంటది. మైనస్ ఉంటది..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన గురించి చేసే వ్యాఖ్యలకు ముందు ఆలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ వ్యాఖ్యలపై మేధావులు, రాజకీయ పండితులు,అక్కడున్న మీడియా జర్నలిస్టు మిత్రులు అవ్వాక్కవ్వడమైంది. ఒకవైపు తాను ఏ పార్టీకి చెందిన వాడ్ని కాదు అంటూనే మరోవైపు కాంగ్రెస్ కు వకల్తా పుచ్చుకోవడం.. మరోపార్టీపై విమర్శలు అది రాజకీయ విమర్శలు చేయడం ఏంటని గుసగుసలాడుకోవడం వారి వంతయింది.