రూటు మార్చిన గులాబీ బాస్ ..!

The pink boss who changed his route..!
తెలంగాణలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలపై ఇటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్, అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ లు వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఇందు లో కాంగ్రెస్‌కి నాలుగు, బీఆర్ఎస్కి ఒకటి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ లో సామాజిక వర్గాల వారీగా ఈ ఎమ్మెల్సీ పోస్టులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీనియర్ నేతలైన వేం నరేందర్‌రెడ్డి, కుమార్ రావు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, పారిజాత నరిసింహ్మారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి లు బరిలో ఉన్నారు..
మరోవైపు బీసీల నుంచి మాజీ ఎంపీ మధు యాష్కీ, చరణ్ కౌశిక్,మాజీ ఎంపీ అంజన్ కుమార్, వజ్రేష్ యాదవ్.. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి రేసులో సునీతారావు నిలుస్తున్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమార్.. మైనార్టీల నుంచి ఫహీం ఖురేషీ, అజరుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ రేసులో ఉన్నారు. ఇక ఎస్సీల నుంచి సంపత్ కుమార్, అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బెల్లయ్యనాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పోటీ పడుతున్నారు.
ఇక తాజాగా మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న శుక్రవారం నుంచి జిల్లా నేతలతో సమా వేశాలు ప్రారంభించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా నోటిఫి కేషన్ వచ్చింది. దీంతో ఆయన జిల్లాలవారీగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు. బీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న మెజార్టీతో ఒక ఎమ్మెల్సీని సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే రెండో ఎమ్మెల్సీని కూడా దక్కించుకోవడానికి అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపు చేయాలని సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకుంటే మరో ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ ఖాతాలోకి పడుతుందని కేసీఆర్ అంచనా. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యత హరీష్ రావు, కేటీఆర్ లకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో పాటు కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టడంతో తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిణామాలు ఉత్కంఠగా మారాయి.
