హైడ్రా వ్యవస్థ ఒకే…! కానీ..?

Dr Dasoj Sravan Give Suggestions To Revanth Reddy On Hydra
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత డా. దాసోజ్ శ్రవణ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పరిపాలనలో తాను తుగ్లక్ తలతన్నెంత మూర్ఖుడిని అని రుజువు చేసుకుండ్రు. ఆలస్యంగానైనా తెలంగాణ హైకోర్ట్ ముల్లుకర్ర పెట్టి పొడిస్తే, తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి చెరువులపై సర్వే చేయాలని ప్రభుత్వ చేసిన నిర్ణయం మంచిదే.
కానీ ఈ సోయి, హైడ్రా అనే మహమ్మారి పేరుతో ప్రజల ఇళ్లు కూల్చక ముందే ఎందుకు లేదు? సర్వే చేయకుండానే, ప్రజల ఇళ్లు కూల్చిన శ్రీ రేవంత్ రెడ్డి అత్యంత ఘోర తప్పిదం చేశారు. వీరు చేసిన ఈ తప్పిదానికి ఎవరు వీరికి శిక్ష వేయాలి? హైడ్రా బెదిరింపులకు కలత చెంది ఆత్మహత్య చేసుకున్న కూకట్ పల్లి బుచ్చ్చమ్మ గారి, వారి కుటుంబ సభ్యులకు ఎవరు న్యాయం చేస్తారు? వీరి ఘాతక చర్యల వల్ల ప్రజలకు కలిగిన ఆవేదనకు, కన్నీళ్లకు సమాధానం ఎవరు చెబుతారు? అధికారం ఉందని, కన్ను మిన్ను కానని అహంకారంతో, వీరు తప్పించుకోగలిగినా, ప్రజల ఇళ్లు కూల్చిన పాపానికి, ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ, వాళ్ళను రోడ్డున పడేసి, వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన పాపానికి వీరు ప్రజా కోర్టులో నిందితుడే, నేరస్తుడే, ముమ్మాటికీ శిక్షార్హుడు.
ఏ వక్తికి అయినా, తిండి, బట్ట, ఇల్లు.. అనేవి అత్యంత ప్రామాణికం కలిగినవి. అందుకే, శ్రీమతి ఇందిరాగాంధీ, రోటి, కాపడా, మకాన్ అనే సిద్ధాంతాలతో పరిపాలిస్తే, ఇప్పుడు అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి చలామణిఅవుతూ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ అడుగుజాడలను అనుసరిస్తూ, బుల్డోజర్ రాజ్యం నడిపిస్తూ అమాయక ప్రజల ఇండ్లను అక్రమంగా కూల్చి వేసి, వాళ్ళ ఆస్తులను విధ్వసం చేసి, తానేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ, సినిమా ఫక్కీ హీరోయిజం చెలాయిస్తూ, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుండ్రు.
ప్రజాకంటకుడిగా మారిన శ్రీ రేవంత్ రెడ్డి నిరంకుశ రాజ్యంలో పండుగ సందర్భంలో నిర్వాసితులై, గుండె పగిలిపోయిన పేద, మధ్య తరగతి ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. స్వంత అన్నతో సహా డబ్బున్న పెద్దోళ్ళకు నోటీసులు ఇచ్చి, సామాన్యుడి ఇండ్లు మాత్రం కూల్చి, తన ప్రజావ్యతిరేక ఫ్యూడల్ వైఖరిని నిర్లజ్జగా చూపించారు. శ్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాక్షసత్వంతో, అధికార అహంకారంతో హైదరాబాదు పరిధిలో మరియు తెలంగాణ వ్యాప్తంగా చేసిన కూల్చివేతలకు బలి అయిన పేద మరియు మధ్యతరగతి ప్రజలను ఆదుకునేది ఎవరు?
శ్రీ రేవంత్ రెడ్డి, తన రాజ్యాంగ వ్యతిరేక దుందుడుకు చర్యల వల్ల నష్టపోయిన వారికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? ఇప్పటి వరకు కూల్చివేతలకు గురైన ప్రజలకు శ్రీ రేవంత్ రెడ్డి, బెశరతుగా క్షమాపణ చెప్పాలి. తాను కూల్చిన ఇళ్లకు, నష్టపరిహారం ప్రభుత్వ ఖజానా నుండైనా సరే, లేదా తన జేబుల నుండైనా సరే చెల్లించాలి.
చెరువులను కూల్చక ముందే సర్వే చేయాలని నెత్తి మీద నోరు పెట్టుకొని మొరపెట్టిన మమ్మల్ని, ప్రజా సంఘాలను, మరియు ప్రజలను పట్టించుకోకుండ, వారి ఆక్రన్దనలను పేద చెవిన పెట్టి, రాత్రికి రాత్రే పేద మధ్యతరగతి ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తు, వారి ఇళ్లను రాక్షసత్వంతో కూల్చి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హై కోర్ట్ ముల్లుకర్ర పెట్టి పొడిస్తే, ఈరోజు మొద్దు నిద్ర విడిచి, చెరువులపై సర్వే చేసి, బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ బౌండరీలు నిర్ణయించాలనుకోవడం తాము చేసిన తప్పును సరిచేసుకున్నప్పటికీ, కూల్చివేతల సమయంలో అమాయక ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, వారి ఇళ్లను సర్వం కూల్చివేసి, పిల్లలు, పెద్దలు రోడ్డున పడ్డ తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ లాంటిది, అంతే కాదు శ్రీ రేవంత్ రెడ్డి అమానవీయ నిరంకుశత్వానికి పరాకాష్ట.
కనీసం ముందే ఈ సర్వేలు చేసి, ప్రజల హక్కులను గుర్తించి, చెరువులను పరిరక్షించటానికి చర్యలు తీసుకుంటే ఈ నష్టం జరగేది కాదు. శ్రీ రేవంత్ రెడ్డి చేసిన దుష్చర్యల వల్ల రెక్కలు ముక్కలు చేసుకొని తమ కష్టార్జితంతో కట్టుకున్న ప్రజల కూలిన ఇళ్లకు, వారి కన్నీళ్లకు, వారి ఆత్మ న్యూనత భావానికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? ముమ్మాటికీ రేవంత్ రెడ్డి మాత్రమే బాద్యుడు.
అయితే, తన తప్పును ఒప్పుకుని పశ్చాత్తాపంచెందడం, వంద పుణ్యకార్యాలకంటే గొప్పది. అంతేకాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ అశాశ్వతమైన అధికారంలో ఉన్నప్పుడు, అహంకారం లేకుండా ఎంత మంది జీవితాల్లో శాశ్వతమైన వెలుగులు నింపినాము అనేది ముఖ్యమనే సూక్ష్మాన్ని శ్రీ రేవంత్ రెడ్డి గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా, శ్రీ రేవంత్ రెడ్డి గారు పశ్చాత్తాపంతో చేసిన తప్పును సరిదిద్దుకొని, అంతఃకరణశుద్ధితో, తమ ఇండ్లు కూలి పోయి, తమ సర్వస్వము నష్టపోయి, గూడుచెదిరిన పక్షులవలె నిస్సహాయంగా ఉన్న ప్రజలకు మానవత్వంతో సహాయం అందించాలి. తన మూర్ఖత్వాన్ని నిరంకుశ వైఖరిని విడిచి, రాజ్యాంగబద్ధంగా, ధర్మ బద్దంగా నడుచుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా:
- హైడ్రా పేరిట చెరువుల పునరుద్దరణకు, సుందరీకరణకు సంబంధిత నిపుణులతో, ప్రజా ప్రతినిధులతో చర్చించి, ఒక సమగ్ర పాలసీని తయారుచేయాలి. అందు నిమిత్తం అయ్యే ఖర్చు సంబందించిన అంచనాలను తయారు చేసి, ప్రజలకు పారదర్శకతతో అందుబాటులో ఉంచాలి. వెంటనే ఇప్పటివరకు కూల్చిన ఇళ్లకు, కోల్పోయిన ఆస్తులకు, UPA ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం, భాదితులందరికి నష్టపరిహారం, పునరావాసం కల్పించాలి.
2. ప్రతి చెరువు యొక్క క్యాచ్‌మెంట్ ఏరియా, బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ వంటి అంశాలను సాటిలైట్ ఇమేజెస్, లైడార్ సర్వే, డ్రోన్ల సాయంతో సేకరించి, ప్రజాప్రతినిధులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ప్రతి చెరువు సర్వే పూర్తి చేయాలి. చెరువు సరిహద్దుల్లో ఉన్న ప్రజల సామాజిక ఆర్ధీక స్థితిగతులపై అధ్యయనం చేసి,,సేకరించిన సమాచారం ప్రకారం అర్హులైన ప్రజల ఆస్తులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి, ప్రతి ఒక్కరికీ సమన్యాయం చేయాలి.
3.చెరువులు మరియు ప్రజల భవిష్యత్తు రక్షణ కోసం, ప్రతి చెరువుకు ప్రజాప్రతినిధులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేసి, చెరువుల పరిరక్షణ బాధ్యత కట్టబెట్టాలి. అలా చేయగలిగితే మాత్రమే దీర్ఘకాలికంగా చెరువులను కాపాడుకోగలుగుతాం.
4.చివరిగా, పర్యావరణంతో పాటు ప్రజల హక్కులను పరిరక్షించడంలో కూడా సమతుల్యత పాటించాలి. .
ఆత్మీయులైన మీకు, మీ కుటుంబ సభ్యులందరికి నవరాత్రి మరియు దసరా పండుగ శుభాకాంక్షలు,
ధన్యవాదములతో…..
ఇట్లు
మీ
డా. శ్రవణ్ దాసోజ,
భారత రాష్ట్ర సమితి
