టార్గెట్ కేటీఆర్.. ఇలా…!
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతిసారీ, ప్రజల్లో సర్కార్‌పై అసమ్మతి పెరిగిన సందర్భాల్లో కేటీఆర్‌ను టార్గెట్‌గా చేసుకొని ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెస్తున్నారని, వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకొని మంత్రులు విమర్శలు చేస్తున్నారని, సంబంధం లేని అంశాల్లో కేటీఆర్ ప్రమేయం ఉన్నదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
ఫోన్ ట్యాపింగ్‌తో మొదలు:
కాంగ్రెస్ రాగానే ‘ఫోన్ ట్యాపింగ్’ అంశాన్ని తెరపైకి తెచ్చింది. కేటీఆర్, కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందంటూ ప్రచారం చేసింది. పలువురు పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించింది. అదే సమయంలో కేటీఆర్ ఆదేశాలతో ఫలానా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు పోలీసులు ఒప్పుకొన్నారంటూ మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసింది.
హోదా మరిచి.. కొండా వ్యాఖ్యల:
ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసింది. నిర్మాణం అక్రమమని ప్రభు త్వం, సక్రమమేనని నాగార్జున కుటుంబం వాదించుకున్నాయి. కానీ.. ఈ అంశంతో సంబంధం లేకున్నా కేటీఆర్‌ను మంత్రి కొండా సురేఖ మధ్యలోకి లాగారు. నాగార్జున కుటుంబ అంతర్గత విషయాలను కేటీఆర్‌కు అంటగడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలను ప్రచారం చేశారు.
జన్వాడ ఫామ్‌హౌస్ :
జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎన్నికల ముందు నుంచీ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నది. ఫామ్‌హౌస్ తనది కాదంటూ కేటీఆర్ వివరణ ఇచ్చి నా వినలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దుష్ప్రచారం కొనసాగించింది. ఈ ఏడాది ఆగస్టులో ఇరిగేషన్ అధికారులు ఫామ్‌హౌస్ వద్ద కొలతలు వేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నదంటూ హడావుడి చేశా రు. ‘కేటీఆర్‌కు చెందిన ఫాం హౌస్‌లో కూల్చివేతలు’ అంటూ మీడియా సైతం హడావుడి చేసింది.
లగచర్ల ఘటనలోనూ:
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులు ఫార్మాసిటీకి భూసేకరణను అడ్డుకొని, అధికారులపై దాడిచేసిన ఘటనలోనూ కేటీఆర్‌ను ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ఘటన వెనుక కేటీఆర్ ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకే జరిగిందంటూ విష ప్రచారం చేసింది. చివరికి పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది.
సోషల్ మీడియాలోనూ..:
కాంగ్రెస్ తమ అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో కేటీఆర్‌పై తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నదని బీఆర్‌ఎస్ నాయకులు చెప్తున్నారు. పార్టీ కార్యక్రమం కోసమో, ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకో ఢిల్లీకి వెళ్లినా ‘కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పెద్దలను కలుస్తున్నారు’ అంటూ ప్రచారం చేశారని, రాజ్‌పాకాల ఇంట్లో ఫంక్షన్ విషయంలోనూ అర్ధరాత్రి దాటిన తర్వాత కేటీఆర్ అక్కడికి వెళ్లారని, ఆయన భార్య పార్టీలో పాల్గొన్నారని అనుచిత ప్రచారం చేశారని మండిపడుతున్నారు. తాజాగా ఫార్ముల్ ఈ రేస్ కూడా ఆకోవలోకే వస్తుందని అంటున్నారు. కేటీఆర్ ఎక్కడా దొరక్కపోవడంతోనే ప్రభుత్వ పెద్దలు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు.. హామీల అమలుపై ప్రశ్నిస్తున్నందుకు కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టాలన్న కక్షపూరిత ధోరణితో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏసీబీతో కేసులు నమోదు చేయించిందని విమర్శిస్తున్నారు.
కుటుంబ దావత్‌కు.. రేవ్‌పార్టీ ముసుగు:
జన్వాడలోని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో ఈ ఏడాది అక్టోబర్‌లో ఒక ఫంక్షన్ జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. అయితే ప్రభుత్వం దీన్ని రేవ్‌పార్టీగా చిత్రీకరించింది. అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్ దొరికాయని, విదేశీ మద్యాన్ని పట్టుకున్నారని, క్యాసినో పరికరాలు ఉన్నాయంటూ ప్రచారం చేశారు. చివరికి అది ఫ్యామిలీ ఫంక్షన్ అని తేలడంతో ప్రభుత్వం తెల్లముఖం వేసింది. విదేశీ మద్యం దొరికిందంటూ తూతూమంత్రంగా కేసు నమోదు చేశారు.