సీఎం ఫోటో లేదని షోకాజ్ నోటీసులు..?
ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు పెట్టలేదని నలుగురు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇటీవల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది. అధికారికంగా నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం ఫొటో పెట్టలేదని ఫిర్యాదు అందింది.
దీంతో కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వేల్పూర్, బాల్కొండ తహసీల్దార్లకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 9న కమ్మర్‌పల్లి, వేల్పూర్, బాల్కొండ, మోర్తాడ్ మండలాల్లో, 10న ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల మండలాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమాలను తహసీల్దార్లు ఏర్పాటు చేశారు.. ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తహసీల్దార్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం ఫొటో లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు నిలదీశారు. దీనిపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా స్పందించి ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫొటో పెట్టాలని సూచించారు. కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వేల్పూర్, బాల్కొండ తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.