రేవంత్ ను అడ్డంగా బుక్ చేస్తున్న మంత్రులు..?
కాంగ్రెస్ ఓ జాతీయ పార్టీ.. ఏ పార్టీలో లేని ఫ్రీడమ్ ఈ పార్టీలో ఉంటుంది.. ఇటు మీడియా సమావేశంలోనైన.. అటు అధికార అనాధికార కార్యక్రమాల్లో సాధారణ కార్యకర్త నుండి సీఎం వరకు అందరికీ ఒకే రకమైన హక్కులుంటాయి. అయితే ఇవి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో శృతిమించుతున్నాయా..?. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అడ్డంగా బుక్ చేస్తున్నాయా అని ఎంపీ.. ఎమ్మెల్యే.. మాజీల దగ్గర నుండి మంత్రుల స్టేట్మెంట్ల వరకు అన్నింటిని పరిశీలిస్తే నిజమే అన్పిస్తుంది.
అసలు విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న అంశం హైడ్రా.. హైడ్రా ద్వారా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన.. ఆలోచన మంచిదే అన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికయ్యే ఖర్చు అక్షరాల లక్ష యాబై వేల కోట్లు అని ప్రకటించేశారు. దీనిపై బీఆర్ఎస్ లక్షకోట్ల అవినీతి చేయడం కోసమే ఈ ప్రాజెక్టు అని ఆరోపించింది. బీఆర్ఎస్ ఆరోపణలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ” అసలు మూసీ సుందరీకరణకు నాలుగోందల కోట్లవుతుంది.. వెయ్యి కోట్లు అవుతుంది.. యాబై వేల కోట్లు అవుతుంది.. లక్ష యాబై వేల కోట్లు అవుతుందని ఎవరూ అన్నారు.. బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే ఇలా గోబేల్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఒకవైపు ముఖ్యమంత్రి నెత్తి నోరు బాదుకుంటూ లక్షయాబై వేల కోట్ల అంటుంటే మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు అదంతా ఫేక్ అని అనడం రేవంత్ ను బుక్ చేయడమే అని వార్తలు విన్పిస్తున్నాయి.
రుణమాఫీ గురించి ఇటీవల వైరాలో జరిగిన రైతు కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన మూడు నెలల్లోనే రెండు లక్షలరుణమా ఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్.. కాంగ్రెస్ రైతుల పక్షపాతి.. రైతన్నల ప్రభుత్వం అని ఊకదంపుడు ప్రసంగం చేశారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి గారు పాల్గోన్న ప్రతి సభలో నేను ఉన్నాను.. ప్రతి కార్యక్రమంలో నేను ఉన్నాను.. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పలేదు.. కావాలనే ప్రతిపక్షాలు మాపై బురద చల్లుతున్నాయని ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు రెండు లక్షల రుణ మాఫీ చేశామని చెప్పిన వీడియోలను బీఆర్ఎస్ తమ సోషల్ మీడియాలో అకౌంట్ల పోస్టులు చేస్తుంది.
మరోవైపు హైడ్రా గురించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ అసలు హైడ్రా కేవలం హైదరాబాద్ ఆర్ఆర్ లోపల పరిధిలోకి వస్తుంది.. ఆర్ఆర్ బయటకు వాళ్లకు హక్కు లేదు.. సంగారెడ్డిలో హైడ్రా అడుగుపెట్టాలంటే నన్ను అడగాలి. నా దగ్గర పర్మిషన్ తీసుకోని రావాలి.. నేను రేవంత్ రెడ్డికి చెబుతాను. అప్పటివరకు సంగారెడ్డి వైపు కన్నెత్తి చూడవద్దు పెద్ద వార్నింగే ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే హైడ్రా బాధితుల గురించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హైడ్రాపై వీడియోలు చేసే వాళ్ళు ఐదు వేలకు అలా నటిస్తు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని ఆరోపించారు.
ఈ పరిణామాలన్నీ ముఖ్యమంత్రికి మంత్రులకు ఆ పార్టీ నేతలకు మధ్య సమన్వయం లేకపోవడాన్ని తెలియజేస్తుందని ఆర్ధమవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై ఢిల్లీ పెద్దలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పలుమార్లు పిర్యాదు చేశారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ కి హైడ్రాపై పెద్దలు అక్షింతలు వేసినట్లు కూడా వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. మంత్రుల ప్రకటనలు.. ఆ పార్టీ నేతల మీడియా సమావేశాలన్నీంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి కి అందరూ కల్సి షాకిస్తూ అడ్డంగా బుక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ రాజకీయ వర్గాల టాక్.