మెదక్ చర్చి ఓ చరిత్ర..!

క్రిస్మస్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ కేథడ్రల్ చర్చిలో జరిగిన వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 29 కోట్ల రూపాయల వ్యయంతో చర్చి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హాజరైన ముఖ్యమంత్రి ఏసు భక్తులందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ చర్చి ఒక గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని అన్నారు.
వందేళ్ల కిందట కరవు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహారం పథకం కింద భోజనం పెట్టి చర్చి నిర్మాణం చేపట్టడం ఒక గొప్ప ఆలోచనగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేటి ఉపాధి హామీ పథకానికి అదే స్ఫూర్తి అని అన్నారు.చర్చితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందన్నారు. విద్య, వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ఎనలేని సేవలు అందించాయని కొనియాడారు.
చర్చి సందర్శనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ , ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ , ఎమ్మెల్యే రోహిత్ రావుతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.