రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటర్..?
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సాధించినదేమిటి? చేయలేకపోయినదేమిటి? ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉన్నది? వంటి పలు అంశాలపై వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రా (వోటా) సంస్థ 2024 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసింది. సింపుల్ రాండమ్ విధానంలో చేసిన ఈ సర్వే కోసం 1677 శాంపిల్స్ సేకరించినట్టు వోటా సీఈవో కంబాలపల్లి కృష్ట మీడియాకు తెలిపారు.
వీరిలో 57% మంది పురుషులు, 43% శాతం మహిళలు ఉన్నారు. పని ఆధారంగా నిరుద్యోగులు, రైతులు, కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు, కార్మికులు, పెన్షనర్లు, చిరు వ్యాపారుల అభిప్రాయం సైతం సర్వే సంస్థ సేకరించినట్టు చెప్పారు. 18 ఏళ్ల నుంచి 65 ఏండ్లు, ఆ పైన వారి వరకు సర్వేలో పాల్గొన్నారు.ఇద్దరు సీఎంల పరిపాలనలో ఎవరి పాలన బాగుందన్న ప్రశ్నకు కేసీఆర్ పాలన బాగుందని 44 శాతం మంది ప్రజలు తేల్చి చెప్పారు.
రేవంత్‌రెడ్డి పాలన బాగుందని 30% మంది చెప్పినట్టు సర్వే నివేదించింది. సీఎంగా రేవంత్‌రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారన్న ప్రశ్నకు ఒక్కరంటే ఒక్కరు కూడా వందకు వంద మార్కులు వేస్తామని చెప్పలేదని, 59 శాతం మంది ఆయనకు 25 మార్కులు వేసి ఫెయిల్ చేసినట్టు వోటా సర్వే పేర్కొన్నది. 200 యూనిట్లలోపు వారందరికీ జీరో కరెంటు బిల్లు అమలు అవుతున్నదా? అన్న ప్రశ్నకు 50 శాతం మంది కొందరికే అమలు అవుతున్నని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? అన్న ప్రశ్నకు బీఆర్‌ఎస్‌కు ఓటేస్తామని 39% మంది చెప్పగా, కాంగ్రెస్‌కే అని 30% మంది, ఎన్డీఏ కూటమికి వేస్తామని 19 శాతం మంది, ఇతరులకు వేస్తామని 7% మంది చెప్పినట్టు సర్వే ఫలితాల్లో వెల్లడించారు.