కేసీఆర్ ను బద్నాం చేయడం ఎలా ?
ఏడు నెలలుగా రాష్ట్రంలో సాగుతున్న ఎపిసోడ్ ఇది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీల అమలు గండం దాటాలంటే అదొక్కటే మార్గమన్న భ్రమలో రేవంత్ టీమ్ ఉంది
కమీషన్ల భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ పార్టీని కాల్చే యత్నం చేస్తూ అనుకూల మీడియాలో వార్తలను ప్రచారం చేస్తుంది. అందులో భాగంగానే నాటి ప్రభుత్వంలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఏ ప్రాతిపదికన నిర్మించారు ? ఈనాడు కథనం. తుమ్మిడిహెట్టిని పక్కన పెట్టారేం ? ఆంధ్రజ్యోతి కథనం. ప్రాణహితను ఎందుకు పక్కన పెట్టారు ? దిశ కథనం. మూడు నెలల వరద నీళ్ల కోసం ఇన్ని వేల కోట్ల ఖర్చా ? వెలుగు కథనం. గ్రావిటీని వదిలేసి ఎత్తిపోతల ఎందుకు ? ఆంధ్రప్రభ కథనం. అన్ని పత్రికలలో వార్తల వడ్డన తీరు వేరైనా బావం ఒక్కటే కేసీఆర్ మీద బురదజల్లడం ఎలా ? కేసీఆర్ ను బద్నాం చేయడం ఎలా ? అని వీక్షకులకు ఆర్ధమవుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గత ఏడు నెలల నుండి జరుగుతున్నది ఇదే. ఆరు గ్యారంటీల పేరుతో 13 అంశాల ప్రాతిపదికన ఇచ్చిన 420 హామీల అమలు నుండి తప్పించుకోవడం ఎలా అన్న డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరంటు, సాగునీటితో పాటు తాగునీరు కూడా మాయమయింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట కరంటు కొనుగోలులో అవకతవకలు, అప్పులు అంటూ హంగామా చేశారు. కొండను తవ్వినా ఎలక కూడా దొరకకపోవడంతో జుడీషియల్ కమిటీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. దాని పేరు మీద నోటీసులు అంటూ హడావిడి చేస్తున్నారు. అయితే కరంటు కొనుగోలు చేసింది చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అన్న విషయం తెలిసి కూడా దాని గురించి నొరెత్తడం లేదు.
ఇక కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి నీళ్లు ఎత్తిపోయడం మాన్పించారు. దీంతో రైతాంగం పంటలు ఎండి యాసంగిలో నీళ్లందక గగ్డోలు పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ మొదటి నుండి చెప్పినట్లుగా కాపర్ డ్యామ్ నిర్మాణం చేయకుండా కాలయాపన చేశారు. చివరకు ఇప్పుడు అదే పనిచేస్తున్నారు. దీని పేరు మీద కూడా ఒక జ్యుడీషియల్ కమిటీ వేసి ఇప్పుడు లీకు వార్తలు రాయిస్తున్నారు.
అయితే ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన రంగనాయక్ సాగర్ నుండి సాగునీళ్లు ఇటీవల యాసంగి సాగుకు విడుదల చేయగా, మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ కు తాగునీళ్లను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఒక వైపు కేసీఆర్ ను, బీఆర్ఎస్ పాలనను బద్నాం చేస్తూనే ఆ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాటినే వినియోగించుకుంటుండడం గమనార్హం.
తెలంగాణలో రేవంత్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడులలో తాటికాయంత అక్షరాలతో బీఆర్ఎస్, కేసీఆర్ మీద విషం చిమ్మడం, కాంగ్రెస్, రేవంత్ ను ఆకాశానికి ఎత్తడం మొదలుపెట్టారు. ఆ వెంటనే మిగతా పత్రికలు, చానళ్లను దారిలోకి తెచ్చుకున్నారు. రాధాక్రిష్ణ డైరెక్ఝన్ లో రేవంత్ యాక్షన్ ఎపిసోడ్ ను రేవంత్ టీం రక్తికట్టిస్తున్నది. చంద్రబాబు నాయుడు దీనిని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తున్నది. జలయజ్ఞంలో తెలంగాణను నిండా ముంచి, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేసి గత పదేళ్లుగా ఏపీ నీటిపారుదల శాఖను పర్యవేక్షిస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణంపై కేసులు వేసి అడ్డుకుని, పోతిరెడ్డి పాడు నీళ్లను తరలించుకుని పోవడంలో కీలకపాత్ర పోషించి, తెలంగాణ ప్రాజెక్టుల మీద పెత్తనాన్ని కేఆర్ఎంబీకి కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించిన ఆదిత్యానాథ్ దాస్ ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా తీసుకోవడమే దీనికి పెద్ద ఉదాహరణ.
కాళేశ్వరం, కరంటు, సాగునీళ్లు, పథకాల అమలు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల పంపిణీ వ్యవహారం అన్నింటా లీకేజీలు, ప్యాకేజీలు, వార్తల వడ్డింపు ప్రాతిపదికన వ్యవహారం కొనసాగుతున్నది. ఈ ఏడు నెలలలోనే వందల కోట్లకు పైగా పత్రికా ప్రకటనలను విచ్చలవిడిగా ఖర్చు చేశారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో 119 స్థానాలకు గాను 39 స్థానాలకు పరిమితం అయింది. 64 స్థానాలతో అత్తెసరు మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక లోక్ సభ ఎన్నికలలో జాతీయ పార్టీల ఉచ్చులో పడి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను గెలిపించారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆంధ్రాలో కేవలం 16 సీట్లు సాధించి కేంద్రంలో చక్రం తిప్పుతున చంద్రబాబును చూసి నాలుక్కరుచుకుంటున్నారు. ఈసారి కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని కేసీఆర్ చెప్పినా వినలేదని సమీక్షించుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనాల గురించి గత పదేళ్ల నుండి కాంగ్రెస్, బీజేపీ ఎన్నడూ కేంద్రంలో పట్టుపట్టింది లేదు. ఇప్పుడు బీజేపీ ఎలాగూ అడగదు. కాంగ్రెస్ అడగదు. అడిగినా కేంద్రం పట్టించుకోదు. తెలంగాణ కోసం నిత్యం పోరాడిన బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభలో ఈ సారి గొంతుక లేదు.
అయితే తెలంగాణలో ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలది కామన్ ఎజెండా. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి ఉంటే తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదు. బీఆర్ఎస్ ఉనికి కోల్పోవాలి అంటే కేసీఆర్ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయాలి. అప్పుడే భవిష్యత్తులో తమ రాజకీయ ఉనికి కొనసాగుతుందన్నది ఆ రెండు పార్టీల అవగాహన. అందుకే బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడు నెలలు అయినా ఈ రెండు పార్టీలు నిత్యం కేసీఆర్ టార్గెట్ గా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ సమాజం ఇప్పటికైనా తేరుకుని ప్రశ్నించకుంటే కాంగ్రెస్ పార్టీ హామీల అమలు సంగతి దేవుడెరుగు తెలంగాణ మరో ఆరు దశాబ్దాలు వెనక్కిపోవడం ఖాయం.