కేసీఆర్‌ పదేండ్ల పాలనలో అసలు అప్పు  ఎంత..?

 కేసీఆర్‌ పదేండ్ల పాలనలో అసలు అప్పు  ఎంత..?

How much was the original debt during KCR’s ten-year rule..?

Loading

కేసీఆర్‌ 3.17 లక్షలకోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారన్నది వాస్తవం. జీఎస్డీపీలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిందీ వాస్తవం. సంపద పెంచి ప్రజలకు పంచిందీ వాస్తవం. కాళేశ్వరం నుంచి యాదాద్రి దాకా.. సెక్రటేరియట్‌ నుంచి కలెక్టరేట్ల దాకా.. అడుగడుగునా రుణ సద్వినియోగం కనపడుతున్నది. 3 లక్షల కోట్లతో 30 లక్షల కోట్ల సంపదను సృష్టించి, అప్పును తెలంగాణ ఆస్తిగా మార్చిన కేసీఆర్‌ కౌశలం కండ్లకు కడుతున్నది.మరి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఈ పన్నెండు నెలల్లో రేవంత్‌ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా 80 వేల కోట్లు! ఇది 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర అప్పు కన్నా ఎక్కువ. మరి ఈ అప్పుతో చేపట్టిన కొత్త ప్రాజెక్టు ఏది? మొదలుపెట్టిన కొత్త పథకం ఏమున్నది? కూలగొట్టుడే తప్ప.. కొత్తగా తట్టెడు మట్టి కూడా తీయని సర్కారు.. 80 వేలకోట్లు అప్పు తెచ్చి చేసిందేంది? సాధించిందేంది?

ఒక్కో విషపుచుక్క ప్రోదిచేసి కాంగ్రెస్‌ సృష్టించిన అభాండాల భాండం బద్ధలైంది.అప్పులపై తప్పుడు కూతలకుచెంపచెళ్లుమనే సమాధానం దొరికింది.పదే పదే ప్రజలపై రుద్దిన అబద్ధపు ప్రచారం ఎట్టకేలకు పటాపంచలైంది.అభివృద్ధిని చిన్నగాచూపి, అప్పును భూతద్దంలో చూపిన కుతంత్రం బట్టబయలైంది.అధికార యావలో కాంగ్రెస్‌ ఇన్నాళ్లు సాగించిన ‘అప్పుల కుప్ప’ప్రాపగాండాను రిజర్వ్‌బ్యాంక్‌ తాజా నివేదిక నిట్టనిలువునా చీల్చిపారేసింది.వాస్తవాల పునాదులపై ఆర్బీఐ ప్రకటించిన లెక్కలు.. కాంగ్రెస్‌ కత్తిగట్టి సాగించిన ‘మిత్తి’మీరిన ప్రచారాన్ని ముక్కలు ముక్కలు చేశాయి.

కేసీఆర్‌ పట్టించుకోలేదని అందామంటే.. పదేండ్ల పసికూన రాష్ట్రం అన్ని సూచీల్లో దేశంలోనే అగ్రభాగానికి చేరింది. అభివృద్ధే చేయలేదని అందామంటే.. కండ్లముందు తెలంగాణ ప్రగతి ప్రదీప్తి మిరుమిట్లుగొల్పుతున్నది. సంపదకు లోటులేదు.. సంక్షేమానికి కొరత రాలేదు. దీంతో కాంగ్రెస్‌ అబద్ధాలను ప్రచారంలో పెట్టింది. రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని బురదచల్లింది. ధనిక రాష్ట్రంగా ఎదిగిన తీరును దాచి.. బాకా చానళ్లతో, భజంత్రీ పత్రికలతో తప్పుడు కథనాలను వండివార్చింది.

అధికార పీఠంపై కూర్చున్నప్పటికీ కాంగ్రెస్‌ తీరు మారలేదు. పార్టీగా సాగించిన తప్పుడు ప్రచారాన్నే ప్రభుత్వ వేదికలపైనా కొనసాగించింది. పదేండ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేశారంటూ ఎవరో గాలి గన్నారావు మాటల్ని పట్టుకుని సీఎం రేవంత్‌ సైతం అధికారిక సమావేశాల్లో ఆరోపణలకు దిగారు. నిజాలే నివ్వెరపోయేలా శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలకు సున్నంవేశారు.

ఇప్పుడవన్నీ పటాపంచలయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో కాంగ్రెస్‌ ఇన్నాళ్లూ సాగించిన అబద్ధపు ప్రచారం శుద్ధ తప్పేనని తేలిపోయింది. పదేండ్లలో తెలంగాణ చేసిన అప్పు 3.17 లక్షల కోట్లేనని ఆధారాలతో, అంకెలతో ఆర్బీఐ సుస్పష్టం చేసింది. సమైక్య పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన రుణం మరో రూ.72 వేల కోట్లని వెల్లడించింది. అన్నీ కలిసినా తెలంగాణ అప్పు 3.87 లక్షల కోట్లేనని కుండబద్ధలు కొట్టింది. ఆర్బీఐ లెక్కల తర్వాత కాంగ్రెస్‌ నేతల నోట మాట పడిపోయింది.

కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్‌ కొన్నేండ్లుగా తీవ్ర దుష్ప్రచారం చేసింది. కేసీఆర్‌ హయాంలో రూ.6.71 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకొని.. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నది.

కానీ.. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.89 లక్షల కోట్లు మాత్రమే. అందులోనూ సమైక్య పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన రుణం 72వేల కోట్లు. అంటే పదేండ్ల కాలంలో కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తీసుకున్న అప్పు 3.17 లక్షల కోట్లే!.

ఇదెవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే.. కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల జమాఖర్చులు చూసే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చెప్పిన మాట. పూర్తి ఆధారాలతో, అంకెలతో.. అధికారికంగా ‘హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండియన్‌ స్టేట్స్‌ 2023-24’లో స్పష్టంచేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.72 వేల కోట్ల రుణభారం ఉంటే.. 2023 నాటికి మొత్తం అప్పు రూ.3.89 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించింది. అంటే.. కేసీఆర్‌ ప్రభుత్వం రూ.3.17 లక్షల కోట్లు మాత్రమే తెచ్చిందన్నది తేటతెల్లం. మరి ఇన్నాళ్లూ అప్పును రెట్టింపు చేసి రూ.7లక్షల కోట్లు అంటూ దుష్ప్రచారం చేసి.. ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందని ఆర్బీఐ నివేదిక చూస్తే స్పష్టమవుతున్నది.

తెచ్చిన నిధులు స్వరాష్ట్ర నిర్మాణనికే..

‘అప్పును భారంగా చూడకుండా.. పెట్టుబడిగా భావించాలి. సరైన మార్గంలో పెట్టుబడి పెడితే దానికి సార్థకత చేకూరుతుంది. అప్పుకు మించిన ఆదాయం, అంతకుమించిన ప్రయోజనాలు కనిపిస్తాయి’ అని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఈ నియమాన్ని పాటించింది. రుణాల రూపంలో సేకరించిన అప్పులను మూలధన వ్యయంగా రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేసింది. సంపదను సృష్టించింది. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసింది. నదులకు నడకలు నేర్పి రిజర్వాయర్లకు మళ్లించింది. ఎండిన పొలాలను నదీజలాలతో తడిపి వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఆదాయాన్ని సంక్షేమ పథకాల రూపంలో పంచింది. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపింది.

Kcr 3

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి.. జలవనరుల అభివృద్ధి

తెలంగాణ ఏర్పడే నాటికి 20 లక్షల ఎకరాలకే సాగునీరు అందేది. పదేండ్ల తర్వాత 1.03 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయికి తెలంగాణ ఎదిగింది. తెలంగాణ జల జీవనాడి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణంతోపాటు అనేక పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయవంతంగా సాగునీరు అందించడం, చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వల్లే సాధ్యమైంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేండ్లు, ఏర్పాటు తర్వాత పదేండ్లలో చేసిన ఖర్చు, జరిగిన అభివృద్ధిని చూస్తే బడి పిల్లాడికైనా అర్థమవుతుంది.

తెలంగాణ ఏర్పాటుకు ముందు..

  • 2004-14 మధ్య ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు వెచ్చించిన నిధులు రూ.38405.12కోట్లు
  • కొత్తగా వచ్చిన ఆయకట్టు 5.71లక్షల ఎకరాలు

తెలంగాణ ఏర్పాటు తర్వాత..

  • పదేండ్లలో ప్రాజెక్టులపై వెచ్చించిన మొత్తం – రూ.1,64,210 కోట్లు
  • 2014-23 మధ్య సాగులోకి తీసుకొచ్చిన ఆయకట్టు – 17.23 లక్షల ఎకరాలు

కేసీఆర్‌ ప్రభుత్వం ఇరిగేషన్‌ రంగంలో మూడు భారీ ప్రాజెక్టులు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. కాళేశ్వరం పూర్తి చేసి 18.83లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించింది. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుల కింద 20 లక్షల ఎకరాలు ఉన్నాయి.
మిషన్‌ కాకతీయ ద్వారా 27,325 చెరువులను పునరుద్ధరించింది. ఇందుకు రూ.9వేల కోట్లు వెచ్చించింది.ఫలితంగా 9.61,టీఎం సీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. రూ.3,850,కోట్లతో 1,200చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. 638 చెక్‌డ్యామ్‌లను పూర్తిచేయడంతో 1.25లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా లభించింది. భూగర్భ జలాలు పెరిగాయి. మరో 316.67కోట్లను వెచ్చించి కాలువలు, తూములను మరమ్మతు చేసింది.

తెలంగాణ ఏర్పాటు తర్వాత పూర్తి చేసిన పెండింగ్‌ ప్రాజెక్టులు..

Godavari Basis

గోదావరి బేసిన్‌లో..

  • ఎల్లంపల్లి,
  • మిడ్‌మానేరు జలాశయం,
  • శ్రీరాంసాగర్‌ రెండోదశ,
  • శ్రీరాంసాగర్‌ వరద కాలువ
  • భాగారెడ్డి సింగూరు కాలువలు
  • కొమురం భీం
  • కిన్నెరసాని కాలువలు
  • గొల్లవాగు
  • మత్తడివాగు
  • పాలెంవాగు
  • ర్యాలివాగు
  • గడ్డెన్నసుద్దవాగు
  • చౌట్‌పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం
  • గూడెం ఎత్తిపోతల పథకం
  • బేతుపల్లి వరద కాలువ
  • గట్టు పొడిచిన వాగు
  • సమ్మకసాగర్‌ బ్యారేజీ
Krishna Basis

కృష్ణాబేసిన్‌లో..

  • జూరాల కాలువలు
  • కల్వకుర్తి
  • జవహర్‌ నెట్టెంపాడు
  • రాజీవ్‌ భీ
Money

మా చేసిన ప్రచారంలో.. అప్పు సగమే!

వాస్తవానికి కేసీఆర్‌ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అప్పులు.. కాంగ్రెస్‌ చేసిన దుష్ప్రచారంలో సగం మాత్రమే అని ఆర్బీఐ నివేదిక చూస్తే అర్థమవుతున్నది. ఆర్బీఐ ప్రకారం రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న అప్పుల భారం రూ.72,658 కోట్లు. 2023-34 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ అప్పులు రూ.3.89 లక్షల కోట్లకు పెరిగింది. అంటే పదేండ్లలో చేసిన రుణ మొత్తం రూ.3,17,015 కోట్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో శాతం పరంగా చూసుకున్నా తెలంగాణ అప్పులు అదుపులోనే ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడేనాటికే జీఎస్డీపీలో 14.4 శాతం అప్పులు ఉండగా.. 2023-24 నాటికి పెరిగింది కేవలం 27.8 శాతం మాత్రమే.

02
Road

విస్తరించిన రోడ్‌ కనెక్టివిటీ

తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో జాతీయ రహదారులు 2,511 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు 4,983 కిలోమీటర్లు మాత్రమే ఉండేవి. రోడ్లు బాగుపడితేనే రవాణా సౌకర్యాలు పెరగడంతోపాటు వాహనాల సగటు వేగం పెరుగుతుందని, పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ఇది మేలు చేస్తుందని ప్రభుత్వం భావించింది. గతేడాది చివరి నాటికి రాష్ట్రంలో రోడ్‌ నెట్‌వర్క్‌ ఏకంగా 32,717 కిలోమీటర్లకు పెరిగింది. ఇందులో రాష్ట్ర రహదారులు 27,734 కిలోమీటర్లు కాగా, జాతీయ రహదారులు 4,983 కిలోమీటర్లకు పెరిగింది. పదేండ్లలో 23 ఆర్వోబీలు, ఆర్యూబీలు నిర్మించింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో 426 కిలోమీటర్ల మేర రోడ్లు, 22 బ్రిడ్జీలు నిర్మించింది. ఫలితంగా ప్రజలకు కనెక్టివిటీ పెరగడంతోపాటు పంట ఉత్పత్తులను, పారిశ్రామిక ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేసే అవకావం కలిగింది.

Mission Bhagiratha

మిషన్‌ భగీరథ

కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన రుణంలో రూ.37 వేల కోట్లతో మిషన్‌ భగీరథ పథకాన్ని పూర్తి చేసింది. ఫలితంగా 23,839 గ్రామీణ ఆవాసాల్లోని 57 లక్షల ఇండ్లకు, పట్టణ స్థానిక సంస్థల్లో విలీనమైన 649 గ్రామీణ ఆవాసాలు, 121 పట్టణ స్థానిక సంస్థలకు సురక్షిత తాగునీటిని అందించింది. దీని ఫలితంగా ప్రజలకు వ్యాధులు తగ్గాయి. మిషన్‌ భగీరథ పథకానికి నేషనల్‌ వాటర్‌ కమిషన్‌-2019 అవార్డు లభించింది. 2022 జల్‌ జీవన్‌ అవార్డుల్లో మొదటి బహుమతి దక్కింది.

Kcr 2

విద్యుత్‌ సరఫరా మెరుగు

ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో సామాన్య ప్రజల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు రోడ్ల మీద ధర్నాలు చేసిన పరిస్థితి. జనరేటర్లు రాజ్యమేలాయి. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వ్యవస్థాపక సామర్థ్యాన్ని పెంచడంతోపాటు సరఫరాను మెరుగుపరిచింది. ఇందుకోసం రూ.39,321 కోట్లు ఖర్చు చేసింది. కొత్తగా 1062 సబ్‌ స్టేషన్లు (33/11 కేవీ), 3.89 లక్షల డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌పార్మర్లు, 1.83 లక్షల కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్‌ లైన్లు ఏర్పాటు చేసింది. ఫలితంగా ఇండ్లకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్తు సరఫరా సాధ్యమైంది. 2021-22లో దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్తు వినియోగం ఉన్న రాష్ట్రంగా నిలిచింది.

స్థాపిత విద్యుత్తు సామర్థ్యం

తెలంగాణ ఏర్పడేనాటికి – 7,778 మెగావాట్లు

2023 మే నాటికి 18,567 మెగావాట్లు

‘రియల్‌’ కళకళ

తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో భూములకు పెద్దగా విలువ లేదు. హైదరాబాద్‌ను మినహాయిస్తే జిల్లాల్లో సగటున ఎకరానికి రూ.2 లక్షల వరకు మాత్రమే పలికింది. నీటి సదుపాయం లేక, పంటలు పండకపోవడంతో కొనేవారే కరువైన పరిస్థితి. ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు కొనొచ్చు అనేవారు. కానీ కేసీఆర్‌ ప్రభుత్వ పదేండ్ల పాలనలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కళకళలాడింది. తెచ్చిన రుణాలను సద్వినియోగం చేస్తూ.. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పొలాలన్నీ పచ్చగా మారాయి. సాగు భూములకు డిమాండ్‌ పెరిగింది. దీనికి తోడు కొత్త జిల్లాలతో పాలన వికేంద్రీకరణ కావడం, రోడ్ల కనెక్టివిటీని అభివృద్ధి చేయడం, కొత్తగా పరిశ్రమలు రావడం.. తదితర కారణాల వల్ల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. సగటున ఎకరం వ్యవసాయ భూమి ధర రూ.25 లక్షల వరకు పెరిగింది. రోడ్లు, కలెక్టరేట్లు, పరిశ్రమల వంటి రియల్‌ ఎస్టేట్‌ ఆకర్షక ప్రాంతాల్లో ఎకరం ధర రూ.కోటిని దాటింది.

స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం

2014-15లో .. రూ.2,175 కోట్లు
2022-23లో.. రూ.14,295 కోట్లు

రాకెట్‌ వేగంతో ఆర్థిక వృద్ధి

కేసీఆర్‌ ప్రభుత్వం ఓవైపు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ.. మరోవైపు తీసుకున్న రుణాలను సక్రమంగా మూలధన వ్యయంగా ఖర్చు చేయడంతో ఆర్థిక రంగంలో రాష్ట్రం కొత్త రికార్డులు నెలక్పొంది. ముఖ్యంగా తలసరి ఆదాయం, జీఎస్డీపీ వృద్ధి, సొంత రాబడుల్లో రాకెట్‌ వేగం నమోదైంది. 2014-15లో ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104గా నమోదైంది. 2023-24 నాటికి రూ.3,47,299కి ఎగబాకింది. 180 శాతం మేర పెరుగుదల నమోదైంది. కొవిడ్‌ కాలంలో దేశంలోని అన్ని రాష్ర్టాల తలసరి ఆదాయ వృద్ధి మైనస్‌లోకి వెళ్లగా, తెలంగాణ మాత్రం ధనాత్మక వృద్ధిని సాధించడం విశేషం.

అన్ని రంగాల్లో స్థిరమైన వృద్ధి కారణంగా రాష్ట్ర జీఎస్డీపీ సైతం పరుగులు పెట్టింది. 2014-15లో ప్రస్తుత ధరలను బట్టి జీఎస్డీపీ రూ. 5.05 లక్షల కోట్లు కాగా.. 2023-24నాటికి రూ.14.64 లక్షల కోట్లకు చేరింది. పదేండ్ల వ్యవధిలో విలువ రూ.9.59 లక్షల కోట్ల మేర పెరిగింది. 190 శాతం వృద్ధిరేటు నమోదైంది.

రాష్ర్టాభివృద్ధికి సూచిక అయిన సొంత రాబడుల్లోనూ రాష్ట్రం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2014-15లో రూ.29,288 కోట్లుగా ఉన్న సొంత రాబడులు.. 2023-24 నాటికి రూ.1,38,181కోట్లకు పెరిగాయి.

రూ.30 లక్షల కోట్ల సంపద

కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతోపాటు అప్పుల రూపంలో తెచ్చిన నిధులతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు చెరువులను బాగు చేసింది. రూ.1650 కోట్లతో సమీకృత కలెక్టరేట్లు నిర్మించింది. హైదరాబాద్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించింది. హైదరాబాద్‌ చుట్టూ టిమ్స్‌ పేరుతో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం చేపట్టింది. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్థూపం.. ఇలా అనేక నిర్మాణాలు చేపట్టింది. ఇలా కేసీఆర్‌ ప్రభుత్వం గత పదేండ్లలో ప్రాజెక్టులు, భవనాల రూపంలో సృష్టించిన ఆస్తులు, పెరిగిన భూముల విలువ, పెరిగిన పంట ఉత్పత్తులు వంటివన్నీ గమనిస్తే సృష్టించిన సంపద విలువ 30 లక్షల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Kcr 1

పట్టెడన్నం లేని స్థితి నుంచి పుట్ల కొద్దీ వడ్ల దాక..

04

పెరిన సాగు

86.03 లక్షల ఎకరాలు

ఉత్పత్తి

189.27 లక్షల టన్నులు

తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో దుర్భిక్షం తాండవిస్తున్నది. వ్యవసాయం భారంగా నడిచింది. భూగర్భజలాల్లేక.. రైతులంతా ఆకాశంవైపు చూసే పరిస్థితి. సరిపడా వానలు పడితేనే పంటలు. లేదంటే రైతులకు అప్పులు మిగిలిన దుస్థితి.

కానీ.. కేసీఆర్‌ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి క్రమబద్ధంగా వ్యవసాయరంగానికి పునరుజ్జీవం కల్పించింది. మిషన్‌ కాకతీయతో చెరువులు బాగు చేసింది. అదే సమయంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి, రిజర్వాయర్లు నిర్మించింది. నదీ జలాలను చెరువులకు నీళ్లు మళ్లించింది. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి. ఉచిత విద్యుత్తుతో పొలాలు నీళ్లతో తడిశాయి. ఫలితంగా ధాన్యం ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వివరాల ప్రకారం 2014-15లో వరిసాగు 34.97 లక్షల ఎకరాలు కాగా.. ధాన్యం ఉత్పత్తి 76.93 లక్షల టన్నులు నమోదైంది. 2023-24నాటికి 117.61 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగి, ధాన్యం ఉత్పత్తి 258.74 లక్షల టన్నులకు చేరింది. అంటే మూడు రెట్లు ఎక్కువ. 2014లో ధాన్యం ఉత్పత్తితో ఏటికేడు పెరిగిన మొత్తాన్ని గణిస్తే గత పదేండ్లలో అదనంగా 825 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ప్రస్తుతం ఒక్కో టన్నుకు మద్ధతు ధర రూ.23 వేలు ఉన్నది. ఈ లెక్కన అదనంగా పండిన వరి ధాన్యం విలువే.. సుమారు రూ.2 లక్షల కోట్లు ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి.

ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఆహార ధాన్యాల ఉత్పత్తి(లక్షల టన్నులు)

పెరిగింది 131.62 లక్షల టన్నులు

ఆర్బీఐ గణాంకాల ప్రకారం చూసినా.. 2014-15 లో రాష్ట్రంలో 71.14 లక్షల టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 2023-24 నాటికి 202.76 లక్షల టన్నులకు పెరిగింది. అంటే పదేండ్లలోనే ఉత్పత్తి 131.62 లక్షల టన్నులు పెరిగింది. 2014తో పోల్చితే ఏటికేడు పెరిగిన మొత్తాన్ని గణిస్తే గత పదేండ్లలో మొత్తం 471.5 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది.

Pensions

ప్రజలకు సంక్షేమం

ఆసరా పెన్షన్లను రూ.2వేలకు పెంచారు. 2014 నుంచి 2014 వరకు పింఛన్ల కోసం రూ.5,558 కోట్లు ఖర్చు చేస్తే.. కేసీఆర్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలోనే రూ.59 వేల కోట్లు ఖర్చు చేసింది. వృద్ధులు వికలాంగులకుతోడు కొత్తగా ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేతన్నలు, గీత కార్మికులు.. ఇలా అనేక వర్గాలకు పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. 1.44 లక్షల మంది మహిళలకు రూ.1,545 కోట్ల మేర పెన్షన్లు అందించారు. 4.25 లక్షల మంది బీడీ కార్మికులకు రూ.5,712 కోట్లు, 18,644 మంది బోదకాలు బాధితులకు రూ.162 కోట్లు, 67,048 మంది గీత కార్మికులకు రూ.880 కోట్లు, 38,240 మంది నేత కార్మికులకు రూ.519 కోట్లు, 4,667 రూ.7 కోట్లు, 37,674 మంది ఎయిడ్స్‌ బాధితులకు రూ.450 కోట్లు, 1967 మంది కళాకారులకు రూ.50 కోట్లు అందజేశారు.

పింఛను లబ్ధిదారులు..

2014 లో : 29,21,828 మంది
ఏటా వ్యయం : రూ.861 కోట్లు

2023 లో: 44,82,254 మంది
ఏటా వ్యయం : రూ.11,628 కోట్లు

పెరుగుదల లబ్ధిదారులు : 15,60,426
ఏటా వ్యయం : 10,767 కోట్లు

  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ప్రవేశపెట్టి దాదాపు 15 లక్షల మందికి సుమారు రూ.13 వేల కోట్లు అందజేశారు. ఫలితంగా ఆడబిడ్డల పెండ్లికి ఆసరా కావడంతోపాటు తల్లిదండ్రులకు అప్పుల భారం తగ్గించినట్టయ్యింది.
  • గొర్రెల పంపిణీ పథకం కింద రూ.5వేల కోట్లు ఖర్చు చేసి.. 3.94 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. వీటిద్వారా మరో కోటిన్నర గొర్రె పిల్లలు పుట్టినట్టు అంచనా. దీంతో గొల్లకుర్మలు ఆర్థికంగా బలపడ్డారు. రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
  • రైతులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు బీమా సదుపాయాన్ని కల్పించారు. దీంతో ఆయా కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కలిగింది.
  • 321 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి, పట్టణ పేదలకు వైద్య సేవలను చేరువ చేసింది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ ఏర్పాటు చేసి దాదాపు 43 లక్షల మందికి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించింది. దీంతో లబ్ధిదారులకు డబ్బులు ఆదా అయ్యాయి. 43 కేంద్రాల్లో ఉచిత డయాలసిస్‌ నిర్వహిస్తూ బాధితులకు సుమారు రూ.700 కోట్లు ఆదా చేసింది. దవాఖానల్లో వసతులు పెంచడం, భవనాలు నిర్మించడం, సిబ్బంది నియామకం వంటివి చేపట్టింది. దీనికితోడు కేసీఆర్‌ కిట్‌, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ వంటి పథకాలతో మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి.
  • కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు ‘తెలంగాణ ఇంక్రిమెంట్‌’ ప్రకటించారు. తర్వాత రెండుసార్లు వేతన సవరణ జరిగింది. 2015లో 43 శాతం, 2020లో 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యుత్తమ వేతనాలు పొందుతున్న గుర్తింపు సాధించారు. 2020లో కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ జరిగింది.
Dawakana

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *