లగచర్లపై ఉక్కు పాదం ఎలా…?-ఎడిటోరియల్ కాలమ్
దేశంలో రాజ్యాంగబద్ధ పాలన నడవాలంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ పెద్ద ప్రచారమే చేశారు. దానిని ఎన్నికల అంశంగా వాడుకున్నారు. అంబేద్కర్ మార్గాన్ని అనుసరిస్తానంటే వద్దనేది ఎవరు? కానీ, రాహుల్ మాటలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో, అదీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే అమలు కాకపోతే నలువైపుల నుంచీ అభ్యంతరాలు వస్తాయి. లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటు విషయమై ఇంతవరకు జరిగిన చర్యలన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే. ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ఉద్రిక్తంగా మారింది. భూ సేకరణ ఉభయ పక్షాలకు లాభసాటిగా ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడమే దీనికి ప్రధాన కారణం.ఫార్మా విలేజ్ పేరిట రైతుల పంచ ప్రాణమైన భూములను లాగేసుకుంటుంటే అసలీ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతున్నదా? అన్న అనుమానం వస్తున్నది.
లగచర్ల ఏజెన్సీ గ్రామం కాకపోయినప్పటికీ ఇక్కడ ఉన్న గిరిజనులకు సంబంధిత చట్టాలలోని కొన్ని అంశాలు వర్తిస్తాయి. ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనుల కోసం 2006లో ఆమోదించిన ఫారెస్ట్ రెగ్యులేషన్ చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ) ఉన్నది. దీన్నే ట్రైబల్ ల్యాండ్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. గిరిజనుల భూముల విషయంలో ఎలా వ్యవహరించాలో ఇందులో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు కలిగించడం, భూ సేకరణపై కొన్ని పరిమితులు విధించడం ప్రధాన అంశాలు. ఆ చట్టం స్ఫూర్తి మిగిలిన గ్రామాల్లోని గిరిజనులకూ స్పష్టంగా వర్తిస్తుంది. కానీ, ఆ నిబంధనలు పాటించకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. 2013లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఆమోదించిన భూ సేకరణ చట్టం మరింత స్పష్టత ఇచ్చింది.
ఈ చట్టం పేరే ‘భూ సేకరణలో సముచిత పరిహారం, పారదర్శకత, పునరావాసం, ఉపాధి పునరుద్ధరణ హక్కు చట్టం’ (ఆర్‌ఎఫ్‌సీటీఎల్‌ఏఆర్‌ఆర్). ఈ చట్టం వివరాల్లోకి వెళ్లకపోయినా పేరు చదివితేనే విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం తగిన పరిహారం, పునరావాసం, అంతకుమించి పారదర్శకత లేకపోవడం వల్లనే రైతు లు ఆందోళనకు దిగారు. పేదల ఉపాధి కోసం ప్రభుత్వం ఇచ్చిన డీ-పట్టాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కూడా నిబంధనలు పాటించాలి. అకస్మాత్తుగా భూములు తీసుకుంటే వాటిలో పంట పండిస్తున్నవారు దిక్కులేని వారవుతారు. వారికి కూడా ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలి. ఇది ప్రభుత్వం ఇచ్చే ఏక పక్ష ఆదేశాల రూపంలో కాకుండా సంప్రదింపుల రూపంలో ఉండాలి. ఇక్కడ మరో రూపంలోనూ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. 19వ అధికరణం ప్రకారం ప్రతి పౌరునికి భావాలను వెల్లడించే స్వేచ్ఛ, సమావేశమయ్యే హక్కు ఉన్న ది. ఈ హక్కులపైనే ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నది. ఇవేవీ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు దోహదపడవు.
అన్నింటికన్నా అభ్యంతరకరమైన విషయమేమంటే.. భూముల్లేని వారు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారని చెప్పడం. ఈ విమర్శ ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. తోటివారి కష్టాల్లో పాల్గొనడం గ్రామాల్లో అనాదిగా వస్తున్న ఆచారం. గిరిజనులకైతే వారి జీవన విధానం. అలాంటి
పరస్పర సహకారం లేకుంటే గూడేల్లో జీవించడమే కష్టం.
పక్కవారి భూమి పోతున్నప్పడు ఇరుగుపొరు గు వారు మద్దతు ఇవ్వకుండా ఉంటారా? నోరు లేనివారి తరపున మాట్లాడకుండా ఉంటారా? ఒకరికొకరు సహాయపడటమే కదా ప్రజాస్వా మ్య జీవనవిధానం. కేరళలో వరదలు వస్తే తెలంగాణ వారు ఆర్థికసాయం చేయలేదా? ఇలా ఆదుకోవడాన్ని అధికారులు ప్రశ్నిస్తే సామాజిక స్పృహ ఉన్నవారికి కష్టం కలుగుతుంది. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి కేసుల్లో ఇరుక్కోవడం వారికేమైనా ఇష్టమా? నోటికాడి కూడు పోయిన దగ్గర, కడుపు మండిన చోట కిరాయి ఉద్యమా లుండవు. రైతుగా కాకున్నా ఏర్పాటయ్యే మం దుల కంపెనీ వల్ల నష్టపోయే వ్యక్తిగా కూడా గ్రామస్థులకు అడిగే హక్కున్నది. ఔషధ కంపెనీ అంటే తప్పనిసరిగా దుర్వాసన వచ్చి పరిసరాలు కలుషితమవుతాయి. ఆ కారణంగా కంపెనీ ఏర్పాటు వల్ల కలిగే మంచి చెడులను ఎవరైనా అడగొచ్చు. ప్రపంచంలోని నిపుణులు, మేధావు లూ ప్రశ్నించవచ్చు. అలాంటివి జరుగుతున్నా యి కూడా. నిస్సహాయులకు అండగా వచ్చినవారిని తప్పు పట్టడమంటే ప్రజాస్వామ్య జీవన విధానాన్ని కాదనడమే. అంటే రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడమే. పైగా ఇలాంటి చర్యలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. రైతులకు మద్దతు గా గిరిజన సంఘాలు, ఇతర సంస్థలు అండగా నిలిస్తే కాదనడం ఎలా సాధ్యం? ఇందుకు న్యాయస్థానాలు కూడా అంగీకరించవు.
సహజంగా తెలంగాణలో గ్రామస్థులు గానీ, గిరిజనులు గానీ ప్రభుత్వాధికారులను ఎప్పుడూ వ్యతిరేకించరు. వారి రాక కోసం ఎదురుచూస్తా రు. ఇందుకు నా అనుభవమే ఉదాహరణ. గతం లో, నేను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కర్నంగడ్డ తండాకు వెళ్లేసరికి రాత్రి 12.30 గంటలైంది. అప్పటివరకు గిరిజనులు, ముఖ్యం గా మహిళలు తిండితిప్పలు లేకుండా ఎదురుచూస్తునే ఉన్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు వారితో కలిసి భోజనం చేసి సమస్యలు విన్నా. ప్రభుత్వ అధికారులతో గిరిజనులు ఎలా వ్యవహరిస్తారన్న దానికి ఇదో నిదర్శనం మాత్రమే. మరి లగచర్లలో గిరిజనులు తిరగబడ్డారంటే ఆ ఆప్యాయత, అనుబంధం ఎక్కడో మిస్ అయినట్టు కనిపిస్తున్నది.
గిరిజనులు భూమిని కోరుకునేది కేవలం కడుపు నింపుకోవడానికీ, డబ్బులు గడించుకోవడానికి కాదు. వారింకా వ్యవసాయ దశలోనే ఉన్నారు. ఇతర వ్యాపకాలు వారికి పెద్దగా తెలియవు. అందుకే ఏ అధికారి, నాయకుడు వెళ్లినా భూమి ఇప్పించాలనో, పట్టా మంజూరు చేయించాలనో కోరుతుంటారు.
మహబూబ్‌నగర్ మండలం కోయల్తండాలో ఐదు ఎకరాలు, గొల్లబండ తండాలో 76 ఎకరాలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ హోదాలో జోక్యం చేసుకున్నా. మొత్తం 100 కుటుంబాల వారికి తిరిగి పట్టాలు ఇప్పించే ఏర్పాటుచేశా. అవి ఇప్పుడు వారికి అందనున్నాయి. అటవీ భూములను గిరిజనులకు ఇప్పిస్తే చెట్ల సంఖ్య తగ్గి పర్యావరణానికి నష్టం కలగదా అని అడగవచ్చు. గిరిజనులు పండించే జొన్నచేను, కందిమొక్కలు కూడా వృక్ష జాతికి చెందినవే. పర్యావరణానికి అంతో ఇంతో మేలు చేస్తాయి. నష్టం మాత్రం కలిగించవు.
భూ సేకరణ చేసేటప్పడు ప్రజలకు నచ్చ జెప్పి మెప్పించాలి. అధికార దర్పం ఏ మాత్రం పనికిరాదు. పోలీసు బందోబస్తు అధికంగా ఉంటే వారిని చూసే భయపడిపోతారు. పోలీసులు ఉంటే మా అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పలేమని రైతులు, గిరిజనులు అన్న సందర్భాలున్నాయి. అందువల్ల పోలీసుల ప్రమే యం ఎంతవరకు ఉండాలన్న దానిపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. సింగరేణి బొగ్గు గనుల కోసం భూములు సేకరించినప్పడు అన్ని విషయాలను అధికారులు వివరంగా చెప్పేవారు. బొగ్గు నిల్వలు ఈ గ్రామంలోనే ఉన్నందున ఇక్కడి భూమే సేకరించక తప్పదని చెప్పేవారు. చెల్లించే పరిహారం, కంపెనీ తరఫున కల్పించే సౌకర్యాల గురించి వివరించేవారు.
మరి కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలుండగా ఫార్మావిలేజ్ ఏర్పాటుకు ఒక్క లగచర్లనే ఎందుకు ఎంచుకున్నారో నచ్చజెప్పాలి. మార్కెట్ ధర, ప్రభుత్వ ధర అన్నింటిని బేరీజు వేసి ఒక నిర్ణయానికి రావాలి. కొన్నిసార్లు మొత్తంగా ఊరికి ఊరునే తొలగించాల్సి వస్తే రైతులతో పాటు వారిపై ఆధారపడిన వృత్తుల వారికి, చిన్న వ్యాపారులకూ పునరావాసం, ఉపాధి కల్పించాలి. ఇల్లూ వాకిలి లేవని, వారికి ఎలాంటి పరిహారం ఇవ్వక, ప్రత్యామ్నాయం చూపక వదిలేస్తే ఎలా బతుకుతారు? ప్రతీ ఒక్కరి సమస్యను పట్టించుకున్నప్పుడే భూ సేకరణ సాఫీగా సాగుతుంది. ఇవేవీ కాకుండా పోలీ సు కేసులు పెట్టడం, తనిఖీలు అంటే మొదటికే మోసం వస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన అన్న మరో సమస్య తెరపైకి వస్తుంది. ఇతర ప్రాంతాల్లోని ప్రాజెక్టులపైనా ప్రభావం చూపుతుంది.
ప్రభుత్వ ఉద్యోగిని ఒకచోట నుంచి మరొకచోటికి బదిలీ చేస్తేనే బాధపడుతారు. అలాంటిది తనకు అన్ని హక్కులున్న భూమిని శాశ్వతంగా తీసుకొని ఏమీ లేనివానిగా నిలబెడుతామంటే రైతుల్లో ఇంకెంత బాధ ఉంటుంది? ఈ మానసిక స్థితిని అర్థం చేసుకున్నప్పుడే భూ సేకరణకు మార్గం సులువవుతుంది. అంతే తప్ప లా పాయింట్లు లాగడం ద్వారానో, అధికార హోదా ప్రదర్శించడం ద్వారానో, బెదిరింపులకు పాల్పడటం ద్వారానో సాధ్యపడదు. తెలంగాణ చరిత్ర మొత్తం చెప్పిన గుణపాఠం ఇదే. దీన్ని మరిచిపోతే ఏం జరుగుతుందో కూడా చరిత్రలో పాఠాలున్నాయి. మరి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆదర్శ భూ సేకరణ విధానాన్ని ఆశించవచ్చా?
(వ్యాసకర్త: డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ , రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్)