ఏ వెలుగులకో ఈ ఫిరాయింపులు ?!
ఆరు దశాబ్దాల తెలంగాణ కలను 14 ఏండ్ల సుధీర్ఘ పోరాటంలో అవమానాలు, అవహేళనలు, రాజీనామాలు, రాజకీయ ఎత్తుగడలు, ఎన్నో ఉత్తాన పత్తానాలను ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు. తెచ్చుకున్న తెలంగాణలో 63 స్థానాలు గెలుచుకుని అధికార పీఠం అందుకున్నారు. ఓటుకునోటు లాంటి ఘటనలతో తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలి అంటే కుట్రలను కూలదోయాలి. రాజకీయ పునరేకీకరణతోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని భావించి ఇతర పార్టీల నుండి చేరికలను ప్రోత్సహించారు.
రాజకీయ అనిశ్చితి ఉంటే తెలంగాణ మీద కన్నేసిన ఆధిపత్య శక్తులు తెలంగాణను చెరబడతాయి అన్నది కేసీఆర్ గ్రహించారు. అటు ఆంధ్రా పెట్టుబడిదారుల కుట్రలు ఎదుర్కొంటూ కేంద్రం సహకారం లేకున్నా 10 ఏళ్లలో తెలంగాణను ప్రగతిపథాన నిలబెట్టారు. ‘ఏడు మండలాలు ఇస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తాను అని ఏడు మండలాలు ఇచ్చాకనే ప్రమాణస్వీకారం చేశాను’ అని ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు తెలంగాణ మీద జరిగిన కుట్రలకు సజీవసాక్ష్యాలు. సీలేరు నుండి కరంటు వాటా ఇవ్వకుండా తెలంగాణను చీకటి చేయాలన్న చంద్రబాబు ఎత్తులను ఆరునెలల పక్కా ప్రణాళికతో కేసీఆర్ చిత్తుచేశారు.
కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ది చేశారు.
పదేళ్ల కేసీఆర్ పాలన మీద విషప్రచారం చేసి, అడ్డగోలు హామీలతో అరచేతిలో స్వర్గం చూయించి సీపీఐతో కలిపి 65 స్థానాలు సాధించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఏడు నెలలు గడుస్తున్న ఉచిత బస్సు ప్రయాణం సంపూర్ణంగా, 200 యూనిట్ల కరంటు పాక్షికంగా మినహా మిగిలిన ఏ ఒక్క హామీని అమలుచేయడం లేదు. ఆరు గ్యారంటీల పేరుతో 13 అంశాలపై 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ హామీలను గాలికి వదిలి ఫిరాయింపుల మీద దృష్టిపెట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆ పార్టీని బలహీనపర్చాలన్న విఫలయత్నాలు చేస్తున్నారు.
గతంలో అనేకమంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. కానీ ఒకరిద్దరు మినహా తిరిగి గెలిచిన చరిత్ర లేదు. బీఆర్ఎస్ నుండి పార్టీ మారిన దానం చరిత్ర అందరికీ తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని వీడిన రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, ఆరూరి రమేష్, సైదిరెడ్డి, సీతారాం నాయక్, భరత్ ప్రసాద్ లు ఓటమి పాలయ్యారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గెలిచిన వారిలో కూతురు కడియం కావ్యకు లోక్ సభ అభ్యర్థిత్వం ఇచ్చిన తర్వాత పార్టీ మారడం అందరినీ ఆశ్చర్యపరిస్తే, లోక్ సభ ఎన్నికల అనంతరం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ ల చేరిక పలువురిని దిగ్బ్రాంతికి గురిచేసింది.
పోచారం శ్రీనివాస్ రెడ్డిని వ్యవసాయ శాఖా మంత్రిగా, స్పీకర్ గా ఉన్నత పదవులు ఇచ్చి లక్ష్మిపుత్రుడు అంటూ తండ్రికన్నా ఎక్కువగా గౌరవించారు. ఇక డాక్టర్ సంజయ్ కి రాజకీయ భవిష్యత్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీని వీరు కష్టకాలంలో విడిచిపెట్టడం తెలంగాణ వాదులను మదనపడేలా చేసింది. భద్రాచలం నుండి గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నుండి వచ్చి గెలిచిన వ్యక్తి కావడంతో ఆయన పార్టీ మారడం పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఇక దానం వ్యవహార శైలి తెలిసిన వారికి కూడా ఆయన పార్టీని వీడడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కానీ పోచారం, సంజయ్ ల వ్యవహారం రాజకీయాల మీద అవగాహన ప్రతి ఒక్కరినీ విస్మయపరిచింది.
పదేళ్ల కేసీఆర్ పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, ఐటీ, పారిశ్రామిక, ఉపాధి రంగాలలో అద్భుత ప్రగతి సాధించిన తెలంగాణ ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో అన్నిరంగాలలో వెనకడుగు వేసింది. మరి పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు ఏ ప్రయోజనాలు ఆశించి పార్టీ మారుతున్నారు అన్నది చర్చించాల్సిన అంశం. తెలంగాణ ప్రయోజనాల కోసమా ? వ్యక్తిగత ప్రయోజనాల కోసమా ? అన్నదే రేపటి వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది .