సీఎం రేవంత్ ను కల్సిన దళిత ప్రజాప్రతినిధులు.!

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ క్రమ పద్ధతిలో షెడ్యూల్డు కులాల వర్గీకరణ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, వారిలో జగిరిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నమేనని వివరించారు. ఈ వర్గీకరణ ప్రక్రియ భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో సుదీర్ఘ కసరత్తు చేశామని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై బిల్లును ఆమోదించి చట్టం చేసిన నేపథ్యంలో ఎస్సీ ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రయత్నించామని తెలిపారు.
“59 కులాలను ఏ రకంగా వర్గీకరించాలి, రోస్టర్ విధానం ఎలా ఖరారు చేయాలన్న విషయాల్లో ఏక సభ్య కమిషన్ చాలా లోతుగా విశ్లేషణలు చేసి ప్రభుత్వానికి 199 పేజీల నివేదిక సమర్పించింది. అందులో వారు ఎస్సీల 15 శాతం రిజర్వేషన్లను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఆ ప్రయత్నం చట్టపరంగా, న్యాయపరంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎస్సీ వర్గాలకు న్యాయం చేయలేమని భావించి నిర్ణయాలు తీసుకున్నాం. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాలంటే దానికొక విధానం ఉంటుంది. రూపొందించించే చట్టంలో లొసుగులు ఉండొద్దు. శాశ్వత పరిష్కారం చూపాలని భావించాం.
వర్గీకరణను దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు. ముఖ్యంగా మాదిగలు ఎవరికీ అన్యాయం చేయడం లేదు. వారి న్యాయమైన హక్కు కోసం వారు ప్రయత్నం చేస్తున్నారనే ఒక విస్తృతమైన అభిప్రాయం కల్పించడం కోసం ప్రభుత్వం ఈ కసరత్తులో పూర్తిగా ప్రయత్నం చేసింది. ఈ అంశం కొలిక్కి వచ్చే వరకు కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. ఎందుకంటే ముందు ఈ అంశం ఏదో ఒకటి తేల్చాలని, పరిష్కారం చూపాలని పట్టుదలతో పనిచేశాం. ఇంత చేసిన తర్వాత వర్గీకరణ వృధా కావొద్దు. భవిష్యత్తులో పది మందికి ఉపయోగపడాలి. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. మీ సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది..” అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహా , పొన్నం ప్రభాకర్ , పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.