కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అగ్రహాం
తెలంగాణలో ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది.. ప్రజా పాలన అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో.. పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారింది. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయి. పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. మీ ప్రజాపాలన అంటే.. ?? అని కేటీఆర్ నిలదీశారు.