రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు అందజేస్తున్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గోల్కొండ కోటలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలకోసం పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు.
రాష్ట్రం ఏర్పడిన మొదట్లో డెబ్బైఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత ఏడాది డిసెంబర్ నెలకు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా మార్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయిన కానీ సంక్షేమాభివృద్ధి పథకాలను ఆపకుండా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేరుస్తున్నాము. ఆరుగ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాము.
రెండు లక్షల రుణమాఫీని సైతం ఈరోజు పూర్తి చేస్తాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలెట్టాము. రైతులకు రుణమాఫీతో పాటు నాణ్యమైన విత్తనాలను అందజేస్తున్నాము. త్వరలోనే రైతుభరోసా పథకాన్ని కూడా అమలు చేస్తాము. నిరుద్యోగ యువత కోసం విదేశాల నుండి వేల కోట్ల పెట్టుబడులు పెట్టే కంపెనీలను ఆహ్వానించాము. మన పోటి దేశంలోఉన్న రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో .. త్వరలోనే డీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేస్తాము” అని ఆయన అన్నారు.