మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆశా వర్కర్ల అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము.. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా? వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు.
మహిళలని చూడకుండా,బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు.ఆశా సోదరీమణుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకింత నిర్బందం, ఎందుకింత నిరంకుశత్వం? ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా? హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాన్ని 15 నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు.
కాంగ్రెస్ చేసిన నయ వంచన పై ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. నిలదీత నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బందాన్ని ప్రయోగిస్తూ, తప్పించుకుంటున్నది. గొంతెత్తిన వారిని అక్రమంగా అరెస్టులు చేస్తూ, అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నది అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.