ఫిరాయింపులపై రేవంత్ కి సుప్రీం కోర్టు బిగ్ షాక్..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింవు కేసుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో నిన్న బుధవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మీద సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీం కోర్టు. బీఆర్ఎస్ బీఫాం మీద గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆపార్టీకి చెందిన హుజూర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ పిటిషన్ మీద మరోసారి విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే.. విలువలు ఏముంటాయంటూ స్పీకర్ ను సుప్రీం కోర్టు నిలదీసింది. దీనిపై స్పందించిన స్పీకర్ తరువున న్యాయవాది ఇప్పటి వరకు తమకు నోటీసులు అందలేదని కోర్టుకు చెప్పటం గమనార్హం.
స్పీకర్ తరపు న్యాయవాది వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ కేసులో ప్రతివాదులైన అసెంబ్లీ సెక్రెటరీ, స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు హైకోర్టు రిజిస్ట్రార్ కు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు మార్చి 22వ తేదీ లోపు సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది.