రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్..!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలపై లొక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, సంబంధిత అధికారులను ఘటనా స్థలానికి పంపించామని తెలియజేశారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రక్షణ శాఖ సిబ్బంది, హైడ్రా ప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమైన విషయాన్ని ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్య సహాయం అందించాలని ఆదేశించామని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఈ ప్రమాద ఘటనపై దాదాపు 20 నిమిషాలు మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
