దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం..!

ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు పెట్టి ఆ తర్వాత మేధావులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకొని, దేశానికి ఆదర్శంగా ఉండేలా, భూభారతి ఆర్వోఆర్ 2025 చట్టాన్ని తీసుకువచ్చాము..అదే స్ఫూర్తితో ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
భూభారతి చట్టానికి సంబంధించి విధివిధానాలను రూపొందించడంపై, హైదరాబాద్ లోని ఎం.సీ.ఆర్.హెచ్.ఆర్.డి.లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో మొదటి రోజు, ఇవ్వాళ, మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
భూభారతి చట్టం రూపకల్పనకు ఎంత కష్టపడ్డామో, ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాలను తయారు చేయడానికి అదే స్థాయిలో కసరత్తు చేయాలని మంత్రి అధికారులను కోరారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా, చిన్న చిన్న తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా విధివిధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఈ నూతన చట్టం భూ యాజమాన్య హక్కులనే కాకుండా, వారి జీవితాలకు ఆత్మగౌరవాన్ని, ఆర్థికస్వతంత్య్రాన్ని తీసుకువస్తుందని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సిసిఎల్ఏ పీడీ సిఎంఆర్ఓ శ్రీ మకరంద్, భూ చట్ట నిపుణులు శ్రీ భూమి సునీల్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
