అసెంబ్లీలో హారీష్ రావు ప్రతిపాదన- అందరూ ఫిదా..!
సోమవారం ఉదయం ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” యూపీఏ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌పై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. దివంగత మాజీ ప్రధానమంత్రి.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ ఖ్యాతిని చాటేలా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది..
స్కిల్ వర్సిటీకి నరసింహారావు పేరు పెట్టాలని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మిగతా సభ్యులు సైతం తమ మద్ధతు తెలిపినట్లు తమతమ శైలీలో సభలో చాలా ఆసక్తితో విన్నారు. భారత రత్నకు మన్మోహన్ సింగ్ 100 శాతం అర్హులేనని చెప్పారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతున్నదని తెలిపారు. గతంలో పీవీకి భారత రత్న ఇవ్వాలని బీఆర్ఎస్ తీర్మానించింది.. దానికి అనుగుణంగా కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.
1996లో కాంగ్రెస్ ఓటమికి ఆర్థిక సంస్కరణలూ కారణమని ఓ కమిటీ నివేదిక ఇచ్చిందని, దానిని చూసిన మన్మోహన్ సింగ్ కంటతడి పెట్టారని పేర్కొన్నారు. మన్మోహన్ భౌతికంగా లేకున్నా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ఉంటాయని తెలిపడంతో సభలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులతో పాటు బీఆర్ఎస్ ,బీజేపీ,ఎంఐఎం,సీపీఐ పార్టీలకు చెందిన సభ్యులు చాలా శ్రద్ధగా ఆయన ప్రసంగాన్ని విన్నారు.