ఒక్కొక్క రైతుకు కాంగ్రెస్ సర్కారు రూ.17,500లు బాకీ..!
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క రైతుకు రైతు భరోసా కింద రూ.17,500 లు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా, రైతు రుణమాఫీ అంశాల గురించి చర్చ జరుగుతుంది. రైతు భరోసాపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” తాము అధికారంలో ఉన్న సమయంలో డెబ్బై వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద రైతులకు అందజేశాము.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ వల్ల ఇవ్వాల్సిన రైతుబంధు డబ్బులను అలానే ఉంచాము. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి.. అప్పటి పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు రైతుబంధు తీసుకుంటే కేవలం ఐదు వేలు మాత్రమే తీసుకుంటారు. అదే మేము అధికారంలోకి వచ్చాక డిసెంబర్ తొమ్మిదో తారీఖున తీసుకుంటే ఎకరాకు ఏడాదికి పదిహేను వేలు అని అన్నారు. రైతులు నమ్మారు. ఓట్లేశారు.
అధికారాన్ని అప్పజెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రైతుబంధు పేరు మార్చారు తప్పా రైతుభరోసా పెంచిన పైసలు దేవుడెరుగు. మేము ఇచ్చిన ఐదు వేలు కూడా ఇవ్వలేదు. గత ఏడాదిగా రెండు విడతలుగా రైతుభరోసా కింద ఒక్కొక్క రైతుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కరానికి రూ. 17,500 బాకీ పడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే.. మొత్తం రూ. 26,775 కోట్లు ఖచ్చితంగా రైతులకు చెల్లించాలని బీఆర్ఎస్ తరుపున కోరుతున్నాము అని ఆయన అన్నారు.